వైయస్సార్సీపీ అభ్యర్థుల ఎంపికపై వడివడిగా సీఎం జగన్ అడుగులు
దసరా నాటికి అభ్యర్థుల ప్రకటన ?
ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులపై కసరత్తులు
గెలుపే ప్రామాణికంగా టికెట్ల కేటాయింపు
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ఎప్పటి నుండో కసరత్తులు ప్రారంభించారు.అభ్యర్థుల ఎంపికకు సంబంధించి దశలవారీగా పూర్తిచేసి దసరా వేళ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కొంతకాలంగా పార్టీలో నేతల వారసులకు టికెట్ల విషయంపై విస్తృత స్థాయిలో చర్చ సాగుతుంది. దీనిపై కూడా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూన్ మాసంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లో మీ వల్ల నా వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని జగన్ అన్నారు. మన జీవితాలన్నీ ప్రజలతో ముడిపడే ఉన్న నేపథ్యంలో పార్టీని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత తనపై ఉందని మన చర్యల వల్ల అటు పార్టీ ఇటు ప్రజలు ఇబ్బంది పడి పరిస్థితి వస్తే తాను తీసుకోబోయే నిర్ణయాలు వేరే ఉంటాయన్నమాట కూడా జగన్ అన్నారు.

ఈ క్రమంలో ఈసారి అభ్యర్థుల ఎంపికపై జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంపిక చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో అభ్యర్థులు ఎంపికపై జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దసరా వేళ మొత్తం అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారా లేక తొలి జాబితాను వరకు విడుదల చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఈసారి ఎమ్మెల్యేల పనితీరుపై పలు మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికల ఆధారంగా సిట్టింగులకు అవకాశం కొత్త అభ్యర్థుల ఖరారు పై జగన్ నిర్ణయం తీసుకుపోతున్నారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాలు కీలకం కానున్నాయి. సామాజిక సమీకరణాల నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో చేసిన ఎంపిక మంచి ఫలితాలు ఇవ్వటంతో ఈసారి కూడా అదే సామాజిక వర్గాల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారన్న ప్రచారం కొనసాగుతుంది. సిట్టింగుల్లో కొంతమందిని మార్చి కొత్త వారిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రతిరోజు ఒక పార్లమెంటు స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డేటాను ఇప్పటికే సీఎం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

కొత్త అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా వారు ప్రజలతో మమేకం కావడం నియోజకవర్గాల్లో వచ్చే అసంతృప్తులను అధిగమించవచ్చని భావిస్తున్నారు. ఇక వారసులకు టికెట్ల విషయంలోనూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారికి సీనియర్లను బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అనారోగ్య కారణాలు పోటీ చేయలేని పరిస్థితుల్లో మాత్రం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 30 మంది అభ్యర్థులను మారుస్తారని ఆ పార్టీ ముఖ్య నేతల నుండి అందుతున్న సమాచారం. సీట్లు దక్కని వారితో మాట్లాడి వారి భవిష్యత్తు పైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

