NewsTelangana

మేడ్చల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం

మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 56.20 కోట్ల నిధులతో శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలోని సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులకు, ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్‌ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ మైదానంలో హెలిప్యాడ్‌ నిర్మాణం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, కలెక్టర్‌ ఎస్‌ హరీశ్‌, జిల్లా నేతలు, అధికారులు, తదితర నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా త్రివర్ణ బెలూన్లను సీఎం ఎగుర వేశారు.