Andhra PradeshHome Page Slider

టీడీపీతో పొత్తుపై క్లారిటీ… బీజేపీ 6 ఎంపీలు, జనసేన 2 ఎంపీలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో మూడు పార్టీల మధ్య వ్యూహాత్మక పొత్తుపై క్లారిటీ వచ్చింది. 2018 వరకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లో ఒకప్పుడు అంతర్భాగంగా ఉన్న టిడిపి… ఇప్పుడు కూటమిని మళ్లీ పుంజుకునేందు దోహదపడుతుందని బీజేపీ భావిస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన చర్చలు సీట్ల పంపకం చుట్టూ ఉన్న కీలక సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాయి. రెండు పార్టీలు సహకరించడానికి సుముఖత వ్యక్తం చేశాయి.

సీట్ల కేటాయింపుపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రాథమిక చర్చ సీట్ల షేరింగ్ విషయమై జరిగింది. పొత్తు ద్వారా బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలిన 17 లోక్‌సభ స్థానాల్లో టిడిపి పోటీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో 30 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బీజేపీ, జనసేన ఆమోదం తెలిపాయి. 145 స్థానాల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. వైజాగ్, విజయవాడ, అరకు, రాజంపేట, రాజమండ్రి, తిరుపతి, హిందూపురం నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉండగా, మచిలీపట్నం, అనకాపల్లి లేదంటే కాకినాడ నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.

అసెంబ్లీ సీట్ల విషయంలో ఎలా అనుసరించాలన్నదానిపై బీజేపీ, జనసేన, టీడీపీతో చర్చిస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లు గెలుచుకోవాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకొంది. అందుకే కీలకమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులను పరిగణనలోకి తీసుకుని ఎన్‌డిఎను విస్తరించే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు, ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బిజెడి)తో కూడా బిజెపి ఎన్నికల పొత్తును యోచిస్తోంది.