తరగతుల విలీనంపై మరోమారు క్లారీటీ… AP విద్యాశాఖ మంత్రి బొత్స
ఏపీలో తరగతుల విలీనంపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గత సోమవారం మీడియాతో మాట్లాడుతూ తరగతులను విలీనం చేయడంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని, అవేవి నిజం కాదని, స్కూళ్లు మూయటం జరగదని స్పష్టం చేశారు. గతంలో విద్యార్థుల కోసం కాకుండా ఇతర కారణాలతో నిర్ణయాలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు విద్యార్థుల దృష్టికోణంలో నిర్ణయం తీసుకున్నామని ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ తెలిపారు. చట్టాల రూపకల్పన, వాటి అమలుపై వైసీపీ నేత, ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడి అనంతరం మీడియాతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర విద్యా సంస్కరణలపై వస్తున్న విమర్శలపై స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గత కొంత కాలంగా ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విలీనంపై పలుప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయని, పాఠశాలల విలీన ప్రక్రియలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల నిర్ణయంతోనే ముందుకు వెళ్తున్నామని బొత్స తెలిపారు. తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు తమ ఇళ్లకు సమీపంలోనే పాఠశాలలను కోరుకోవడం సబబు కాదని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో జరిగింది కేవలం తరగతుల విలీనం మాత్రమేనని… పాఠశాలల విలీనం లేదని అన్నారు. రాబోయే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకోని మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 5,800 పాఠశాలలను మ్యాపింగ్ చేసి విలీనం చేశామని బొత్స తెలిపారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. సీఎం సహా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. అనవసరంగా ప్రచారం చేయవద్దని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించవద్దని బొత్స సూచించారు. విద్యావ్యవస్థ నుంచి ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయంలో తనకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.