Andhra Pradesh

ఆన్‌లైన్‌లో లడ్డూలు అమ్మం-టీటీడీ స్పష్టీకరణ

తిరుమల లడ్డూలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేమన్న విషయం తెలుసుకోవాలని టీటీడీ భక్తులకు స్పష్టం చేసింది. www.tirupatibalaji.ap.gov.inలో భక్తులు ఆన్‌లైన్‌లో లడ్డూలను బుక్ చేసుకోవచ్చని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ క్లారిటీ వచ్చింది. అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధ తిరుమల లడ్డూ ప్రసాదాలను భక్తులు దర్శనం టిక్కెట్లతో పాటు మాత్రమే బుక్ చేసుకుంటారని… విడిగా బుక్ చేసుకోలేరని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రజలను నకిలీ సమాచారంతో తప్పుదారి పట్టించవద్దని టీటీడీ అభ్యర్థించింది. అంతకుముందు, ప్రఖ్యాత లడ్డూల పరిమాణం బరువులో మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని పాలకమండలి ఖండించింది. లడ్డూ బరువు 160 గ్రాముల నుంచి 180 గ్రాముల వరకు ఉంటుందని టీటీడీ పేర్కొంది. ప్రతిరోజూ ఆలయ వంటశాలలో ‘పోటు’గా పిలిచే లడ్డూలను ప్రత్యేక ట్రేలో ఉంచుతామని, అధికారులు ఒక్కో ట్రే బరువును పరిశీలిస్తారని చెప్పారు.