చైనా భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోంది..
భారత్- చైనా సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా భారత్‌పై యుద్ధానికి సన్నద్ధం అవుతోందన్నారు. ఈ విషయంలో ఓ స్పష్టమైన అభిప్రాయంతో చైనా ఉందని వివరించారు. చైనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అన్నారు. సరిహద్దుల్లో వారు ఆయుధాలను సమకూరుస్తున్న తీరు చూస్తే ఇది అర్థమవుతుందని రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ.. దాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ యుద్ధ ముప్పును దాచి పెట్టలేమని వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం ఈవెంట్ సర్కార్‌గా మారిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. వ్యూహాత్మకంగా శత్రువును దెబ్బకొట్టడానికి బదులుగా ఈవెంట్ కార్యక్రమాలతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్లను నిర్వహించడం వల్ల యుద్ధ భయాలు తొలగిపోవని, అందుకు సమర్థవంతమైన విధేశీ విధానాలకు అనుసరించాల్సిన అవసరం ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

