భారత్ సరిహద్దుల్లో ..డ్రాగన్ ఓవరాక్షన్..
భారత్‌ను కూడా తైవాన్‌లా… భయపెట్టాలని చైనా పన్నాగాలు పన్నుతోంది. దీనిలో భాగంగా చైనా తన అంబులపొదిలో ఉన్న అన్నీ అస్త్రాలను ప్రయోగిస్తుంది. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో చైనా యుద్ధవిమానాల రణగొణ ధ్వనులు పెరిగాయి. అయితే ఇటువంటి చర్యలను కూడా చైనా ప్రతినిధి సమర్దించుకోవడం గమనార్హం. మరోవైపు డోక్లాంకు అత్యంత సమీపంలో చైనా ఒక గ్రామాన్ని నిర్మించినట్లు ఇటీవల కాలంలో ఒక ప్రైవేటు సంస్థ సేకరించిన ఉప గ్రహా చిత్రాల్లో వెల్లడయ్యింది. ఈ డోక్లాం ప్రాంతం 2017లో భారత్ -చైనా దళాలు ముఖాముఖిగా తలపడిన ప్రదేశం. దీనికి సమీపంలో ఉన్న అమోచూ ప్రాంతంలో చైనా ఏకంగా ఒక చిన్న గ్రామాన్నే నిర్మించి భారత్ భూభాగాన్ని మింగేసింది. అయితే ఇటీవల కాలంలో 16వ భారత-చైనా కోర్ కమాండర్ల సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన వార్తలను కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కనీసం ప్రస్తావించలేదు. అదే సమయంలో భారత్ సరిహద్దుల్లో నిర్వహించిన వాయుసేన విన్యాసాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి ఈ చర్చల్లో భారత్ వెనక్కి తగ్గకపోవడం చైనాకు సమస్యగా మారింది. ఈ చర్చల్లో పెట్రోలింగ్ పాయింట్ 15పై కూడా తుది నిర్ణయం తీసుకోలేదు. చర్చల్లో దెప్సాంగ్, దెమ్‌చోక్‌లపై కూడా చైనా ఆసక్తి చూపలేదు. కానీ భారత్ మాత్రం వీటి వద్ద సైనిక బలగాల ఉపసంహరణ జరగాలని తేల్చి చెప్పడంతో చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి.తాజాగా పీపీ15 నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి వెళ్లే అంశంలో కొంత సానూకూల సంకేతాలు కనిపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.