చిన్న పిల్లలకు కూడా చెప్పాల్సిందే !
ప్రస్తుత ఆటవిక సమాజంలో ఆడపిల్లలను బయటకు పంపాలంటే భయంగా ఉంటోంది. ఎటునుండి ఏ ఆపద వస్తుందో, ఏ కీచకుడి కళ్లు అమ్మాయి మీద పడతాయో అంటూ అనుక్షణం తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతూనే ఉంటారు. అందుకే చిన్నవయస్సు పిల్లలైనా సరే, వారికి జాగ్రత్తలు చెప్పడం చాలా అవసరం. తల్లి ఈ బాధ్యతను తీసుకోవలసి ఉంటుంది.
అయితే ఇది అంత ఈజీ విషయం కాదు. వారి వయస్సుకు తగినట్టుగా చిన్నచిన్న సంఘటనలు, కథల రూపంలో చెప్పవలసి ఉంటుంది. బయటి వ్యక్తులు “ఎక్కడ తాకితే పర్వాలేదు. ఎక్కడ తాకితే తప్పు” అనే విషయాలు 10 సంవత్సరాల లోపు పిల్లలకు అంత సులువుగా అర్థం చేసుకోలేరు. అందుకే “గుడ్ టచ్, బ్యాడ్ టచ్ “అనే విషయాలు చాలా జాగ్రత్తగా చెప్పవలసి ఉంటుంది.

ఎదుటి వ్యక్తి అభ్యంతరకరమైన పనులు చేయడం, ఎవరూ లేని చోటుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించడం వంటివి, తాకరాని ప్రదేశాలలో శరీరాన్ని తాకడానికి ప్రయత్నించడం వంటి విషయాలలో ఎలా తప్పించుకోవాలి వంటి విషయాలను అర్థమయ్యేలా చెప్పాలి. తప్పించుకోవడానికి గట్టిగా అరవడం, చుట్టుప్రక్కల వారి దృష్టిలో పడేలా ప్రవర్తించడం వంటి చిన్న మెళకువలు నేర్పించాలి.
కానీ మరీ భయపెట్టేవిధంగా చెప్పామంటే వారు నిజంగా దగ్గర బంధువులను, స్నేహితులను కూడా నమ్మకుండా దూరం చేసుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల వారు భయభ్రాంతులకు గురి కాకుండా చిన్ని చిన్ని ఉదాహరణలతో జాగ్రత్తగా ఉండమని మాత్రమే హెచ్చరించవలసి ఉంటుంది.

