Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsviral

చెక్కు క్లియరెన్స్ ఇకపై గంటల్లోనే

రిజర్వ్ బ్యాంక్ తాజా ఆదేశాల ప్రకారం ఇకపై భారత్ లో చెక్కు క్లియరింగ్ వ్యవస్థ చాలా వేగంగా మారనుంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్పులు తీసుకువచ్చింది. గతంలో రెండు, మూడు రోజుల సమయం పట్టే చెక్ క్లియరెన్స్ ఇకపై గంటల్లోనే జరిగి, ఖాతాలలో సొమ్ములు క్రెడిట్ కానున్నాయి. కొత్త విధానం ప్రకారం, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకు శాఖలలో జమ చేసిన అన్ని చెక్కులను స్కాన్ చేసి, ముగింపు రోజు కోసం వేచి ఉండటానికి బదులుగా, తక్షణమే సెంట్రల్ క్లియరింగ్ హౌస్‌ కు పంపుతారు. క్లియరింగ్ హౌస్, చెక్ ఇమేజ్‌ లను ఎప్పటికప్పుడే డ్రాయీ బ్యాంకులకు విడుదల చేస్తుంది. డ్రాయీ బ్యాంకుకు చెక్ ఇమేజ్ వచ్చిన తర్వాత చెక్‌ క్లియర్‌ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి సాయంత్రం 7 గంటల వరకు సమయం ఉంటుంది. చెక్‌ ల భద్రతను పెంచడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ పాజిటివ్ పే సిస్టమ్‌ను తప్పనిసరి చేసింది. ఈ విధానంలో రూ.50,000 కంటే ఎక్కువ విలువైన చెక్‌ల కోసం కస్టమర్లు ముందుగానే అకౌంట్ నంబర్, చెక్ నంబర్, చెక్ తేదీ, చెక్ మొత్తం లబ్ధిదారుడి పేరు తెలియజేయాలి. ఈ వివరాలను చెక్ డిపాజిట్ చేయడానికి కనీసం 24 పని గంటల ముందు బ్యాంకుకు ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.
బ్యాంక్ వాటిని ధృవీకరించిన తర్వాత చెక్ వివరాలు సరిపోలితే క్లియర్ అవుతుంది. ఒకవేళ వివరాలు మ్యాచ్ కాకపోతే చెక్ తిరస్కరించబడుతుంది. ఖాతాదారులు మళ్లీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రూ.5లక్షల కంటే ఎక్కువ విలువైన చెక్‌ లకు పాజిటివ్ పే సిస్టమ్ తప్పనిసరి. అయితే రూ.50,000పైన ఉన్న చెక్‌లకు దీనిని ఉపయోగించమని బ్యాంకులు సిఫార్సు చేస్తున్నాయి. ఆర్బీఐ ఈ కొత్త విధానాన్ని రెండు దశల్లో అమలు చేయనుంది. మొదటి దశ అక్టోబర్ 4, 2025 నుంచి మొదలైంది. రెండో దశ జనవరి 3, 2026 నుంచి అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానం చెక్ క్లియరెన్స్‌ ను వేగవంతం చేయడమే కాకుండా మీ లావాదేవీలను మరింత సురక్షితం చేస్తుంది. కస్టమర్లు తమ చెక్ వివరాలను జాగ్రత్తగా నింపడం, పాజిటివ్ పే సిస్టమ్‌ ను ఉపయోగించడం ద్వారా వేగవంతమైన క్లియరెన్స్ ప్రయోజనాలు పొందవచ్చు.