ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు లేచే పరిస్థితి లేదు : పేర్నినాని
డూప్లికేట్ స్వామీజీలా చంద్రబాబు మారిపోయాడని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు అంటున్నారని, బాబుతో ఇదేం కర్మ అంటూ జనం అంటున్నారని పేర్నినాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జనం అమాయకులని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు. ప్రజలు తిరగపడి బాదేవరకు చంద్రబాబు ఇలానే మాట్లాడతారన్నారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు లేచే పరిస్థితి లేదని పేర్ని నాని పేర్కొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, నిత్యావసర ధరలు పెరగడాన్ని కూడా వైసీపీ ప్రభుత్వంపై రుద్దుతున్న చంద్రబాబు హెరిటేజ్‌లో పాలు, పెరుగు ధరలు ఎలా ఉన్నాయో చెప్పాలన్నారు. బయట ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతుంది వాళ్లేనని పేర్నినాని విమర్శించారు. కాంతారావు… రాజనాల సినిమాలలోని డైలాగులు ఇప్పుడు చెబితే జనం నమ్ముతారా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.

