Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

చంద్రబాబుకు భక్తి లేదు.. భయం లేదు

చంద్రబాబుకు దేవుడి పట్ల భయం లేదని, భక్తి అసలే లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం వినియోగిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు . అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ నియామకం , లడ్డూ నెయ్యి కొనుగోలు వ్యవహారాల్లో జరుగుతున్న పరిణామాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.

టీటీడీ చైర్మన్ నియామకంపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పవిత్ర పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి కలిగిన వారు ఉండాలని, కానీ చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నియమించారని విమర్శించారు. ఒక మహిళ తనను మోసం చేశారని ఎన్నికల ముందే లేఖ రాసినా, బాధ్యత గల వ్యక్తిగా చంద్రబాబు ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని చైర్మన్‌గా నియమించడం ఆలయ పవిత్రతను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లడ్డూ నెయ్యి కొనుగోలులో భారీ స్కామ్ జరుగుతోందని జగన్ ఆరోపించారు. గత పదేళ్లుగా నెయ్యి ధర సగటున రూ. 278 నుంచి రూ. 330 మధ్య ఉంటే, ఇప్పుడు తన సొంత సంస్థ అయిన ‘హెరిటేజ్’ కి మేలు చేసేలా కిలో నెయ్యి ధరను ఏకంగా రూ. 658కి పెంచి కట్టబెట్టారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలతో రాజకీయ దుమారం రేపి, చివరకు నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా చంద్రబాబు మార్చుకున్నారని ఆయన దుయ్యబట్టారు.

నాణ్యత లేని ట్యాంకర్లు చంద్రబాబు హయాంలోనే టీటీడీకి వచ్చాయని, ఈ విషయాన్ని సీబీఐ-సిట్ ఛార్జిషీటులో కూడా స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. తన హయాంలో జరిగిన తప్పులను ఇతరులపైకి నెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఆలయాల నిర్వహణలో ప్రభుత్వానికి భక్తి, నిష్ఠ, నిజాయితీ లేదనడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

పవిత్రమైన లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయం చేస్తూ, మరోవైపు స్కామ్‌లకు చంద్రబాబు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం అత్యంత దారుణమని ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.