చంద్రబాబుకు బిగ్ షాక్ ….! మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఎంపీ
చంద్రబాబు తీరుతో కేశినేని నాని మనోభావాలు దెబ్బతిన్నాయ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. వైసీపీ పార్టీకి కొందరు నేతలు రాజీనామాలు చేయడం, వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. ఇప్పుడు ఈ పార్టీలకు తోడు టిడిపి పార్టీకి కూడా గట్టి షాక్ తగిలిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. టిడిపి ఎంపీ కేశినేని నానికి రాబోయే ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వడం లేదంటూ చంద్రబాబు ప్రకటించడంతో పాటు, తిరువూరు సభకు కూడా నానిని రావొద్దనడంతో బాగా హర్టయినట్లున్నారు. దీనితో పార్టీకి రాజీనామా చేస్తానంటూ ట్విటర్‌లో ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదన్నప్పుడు నేను పార్టీలో కొనసాగడం తప్పవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ట్విటర్ వేదికగా అభిమానులకు తెలియజెప్పారు.
అభిమానుల మైండ్ సెట్ తనకు తెలుసంటూ తాను టిడిపి పార్టీకి ఓనర్‌ను కాదని సెటైర్లు వేశారు. టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెప్తానంటూ ఝలక్ ఇచ్చారు. పైగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంటూ ముగ్గురు పెద్ద మనుషులతో చంద్రబాబు చెప్పించారని వాపోయారు. దీనితో ఆయన మనోభావాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తాను ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేని, అలాంటి పరిస్థితులు వారే కల్పిస్తున్నారని కామెంట్ చేశారు. మొన్న మీడియాతో మాట్లాడుతూ ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో నిర్ణయించేది ప్రజలేనని, తనను నమ్ముకుని కొన్ని వేలమంది ఉన్నారని, ఒక ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పే హక్కు పార్టీ పెద్దలకు లేదన్నారు. తాను ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసి గెలవగలగలనని సవాల్ చేశారు. దీనితో రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయోనని ఆసక్తి నెలకొంది.

