జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు-న్యాయమూర్తితో చంద్రబాబు
ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ రిమాండ్, కస్టడీ విచారణ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయమూర్తితో మాట్లాడారు. జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు. తన హక్కులు కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలని న్యాయమూర్తిని ఆయన కోరారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తనదన్నారు. చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కన్పిస్తోందన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. తప్పు చేసి ఉంటే విచారించి అరెస్టు చేయాల్సి ఉందన్నారు.ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన అని న్యాయమూర్తితో చంద్రబాబు చెప్పారు. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారన్నారు చంద్రబాబు. తనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని.. నిర్ధారణ జరగలేదన్నారు. హక్కులను, రాజ్యాంగ విలువలను పరిరక్షించాలన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబును న్యాయమూర్తి ఓదార్చారు. మీరు పోలీసు కస్టడీలో లేరని, జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారన్నారు. జ్యుడీషియల్ కస్టడీని శిక్షగా భావించొద్దన్నారు. చట్టం, నిబంధనల ప్రకారమే రిమాండ్ విధించామని చెప్పారు. మీపై ఆరోపణలు మాత్రమే వచ్చాయన్న న్యయామూర్తి, నేరం నిరూపణ కాలేదన్నారు. జైలులో సౌకర్యాల విషయంలో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ప్రశ్నించారు. ఏదైనా అవసరమనుకుంటే అందుకు తగిన విధంగా ఆదేశిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీఐడీ కోరుతుందని ఏసీబీ జడ్జి చంద్రబాబుకు చెప్పారు. కస్టడీ అక్కర్లేదని మీ తరపున న్యాయవాదులు వాదించారని వివరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఏసీబీ కోర్టు జడ్జి పేర్కొన్నారు. చంద్రబాబు కస్టడీపై సీఐడీ పిటిషన్‌పై తీర్పు మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేశారు. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చాక ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.