NationalNews

రైతు కమిటీ సత్యాలు… అసత్యాలు…

Share with

కేంద్ర ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం కనీస మద్దతు ధర కోసం ఏర్పాటు చేసిన కమిటీ గురించి ప్రతిపక్షలు చేస్తున్న విమర్శలు పూర్తి అవాస్తవాలు… కమిటీ కంటి తుడుపు అంటూ చేస్తున్న ప్రచారం అసత్యం… ఈ నేపథ్యంలో… ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించి నిజానిజాలు తెలుసుకుందాం…

కేంద్ర ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం కనీస మద్దతు ధర కోసం ఏర్పాటు చేసిన కమిటీపై కొందరు నానా యాగీ చేస్తున్నారు. ఒక అబద్దాన్ని వందసార్లు వందమందికి చెబితే అది నిజమైపోతుందన్నట్టుగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయ్. కేంద్రం రైతుల కోసం ఏర్పాటు చేసిన “కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ” కోసం ఏర్పాటు చేసిన కమిటీ… విశిష్టమైనది.. సర్వోత్తమమైనది. రైతు చట్టాలను నల్ల చట్టాలని అవి రైతుల పాలిట యమాపాసాలని… ఈ చట్టాల రద్దు రైతుల విజయమని… కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వమని రకరకాల పెడార్థాలు పెడుతూ విష ప్రచారం చేస్తున్నాయ్. అసలు చట్టాలు రైతులకు ఎలా వ్యతిరేకమో ఏ పార్టీ కూడా చెప్పిన పాపాన పోలేదు. కనీసం పార్లమెంట్లో వివరించనూ లేదు. మరి రైతు సంఘాల ముసుగులో రైతులను పక్క దారి పట్టించి… రైతుల ముసుగులో వేర్పాటువాద నేత టికాయత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. పర్యటనలు బట్టి అంచనా వేయవచ్చు.

రైతు చట్టాలు గురుంచి చెప్పాలంటే… సులభంగా రైతు తాను పండించిన పంటను దేశంలో తనకు ఇష్టమైన రేటుకు… ఇష్టమైన వారికి అమ్ముకోవచ్చు. అప్పుడు మండీల రూపంలో ఉండే సిండికేట్ వ్యాపారస్తులకు ఈ చట్టం వల్ల చాలా నష్టమే కలుగుతుంది. టికాయట్ రూపంలో మండీ వ్యాపారస్తులు నడిపిన ఉద్యమమే ఇది. పంజబ్, హర్యానా… రాష్ట్రాలలో అధికమైన వ్యాపార మండీలు ఉండడం వల్ల వారి ఆధ్వర్యంలోనే ఈ ఉద్యమం నడిచింది. చివరికి మంచి చట్టాలను సైతం వెనక్కి తీసుకోవలసి వచ్చింది. మరో విషయం గమనిస్తే నరేంద్రమోదీ ప్రభుత్వం గత నవంబర్‌లో చట్టాలను వెనక్కి తీసుకుంటూ… రైతులకు ఒక హామీ ఇచ్చింది. అది ఏటంటే “కనీస మద్దతు ధర” కు చట్ట బద్ధత కల్పించడం… ఆ హామీని అనుసరించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో దేశంలోని అత్యున్నతమైన ప్రతిభ… వ్యవసాయ రంగంలో సుదీర్ఘ కాలం పనిచేసి అనుభవం కలిగిన వారు సభ్యులుగా ఉన్నారు. చాలా మందిలో అత్యున్నతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరంతా బీజేపీ సానుభూతిపరులంటూ ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోంది. ఈ కమిటీలో రైతు ఉద్యమం నడిపిన భారతీయ కిసాన్ సంఘ్ నుంచి ముగ్గురు ప్రతినిధులకు స్థానం కల్పించారు. మరి వారు ఎప్పుడు బీజేపీ సానుభూతిపరులు అయ్యారు?

ఇక దేశంలో అత్యున్నత ” రైతు పురస్కారం” అందుకున్న రైతు భారత్ భూషణ్ త్యాగి యూపీ నుంచి 2020 లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆయన తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా సుమారు లక్ష మంది రైతులకు తన వ్యవసాయ క్షేత్రంలో ఉచితంగా శిక్షణ కార్యక్రమలు నిర్వహించిన వ్యక్తి… ఆయన బీజేపీ వ్యక్తి ఎప్పుడు అయ్యారో విమర్శలుకు వివరిస్తే బాగుటుంది. ఇంకా దేశంలోని వివిధ రైతు సంఘాల ప్రతినిధులు.. గునపాటి పాటిల్, కృష్ణ నవీన్ చౌదరి, ప్రమోద్ కుమార్, గుని ప్రకాష్, సయ్యద్ పాషా… వీరందరూ.. దేశంలో ప్రధానమైన రైతు సంఘాల ప్రతినిధులు.. వీరంతా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యులు. మరి వీరంతా ఎలా బీజేపీ సభ్యులో సమాధానం చెప్పాలి కదా. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ డెవలెప్మెంట్, IIM Ahamadhabad శాస్త్రవేత్తలు CSC శేఖర్, సుఖ్ పాల్ సింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు అనేక కిష్టమైన సమస్యలకు పరిష్కారాలు చూపించారు.

వారితోపాటు… నీతి అయోగ్ నుంచి రమేష్ చంద్ ..CACP నుంచి నవీన్ సింఘ్ సభ్యులు కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు కాకుండా దేశంలో ప్రముఖ మైన వ్యవసాయ విశ్వవిద్యాలయల నుంచి సీనియర్ సభ్యులను కమిటీలో నియమించి… రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశాన్ని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా కేంద్ర ప్రభుత్వంలోని కార్యదర్శిలను కమిటీలో సభ్యులుగా నియమించారు. మరో విషయం ఏమంటే ఆంద్రప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, ఒడిసా రాష్ట్రాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కూడా కమిటీలో సభ్యులుగా నియమించారు. మరి వీరంతా బీజేపీ సానుభూతి పరులేనా… అన్న విషయాన్ని విమర్శకు స్పష్టం చేయాలి. వేసిన కమిటి నిజాయితీగా పనిచేయడానికి ఎక్కడ కూడా రాజకీయ నాయకులకు అవకాశం లేకుండా ఉంది. కానీ కమిటీ పట్ల విషపు వార్తలు ఎంత వరకు సమంజసం.

ఈ కమిటీ… రైతులకు కనీస మద్దతు ధర ఎంత ఉండాలి? ఆ కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత ఎలా కల్పించాలి? అనే విషయం మీద వివిధ ప్రాంతాల నుంచి రైతుల ఆకాoక్షలను తెలుసుకొని రిపోర్ట్ ఇస్తుంది. అసలు కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తరువాత… దాన్ని పార్లమెంట్‌లో చర్చ జరిగిన తరువాత… చివరగా అది చట్టం అవుతుంది. అసలు కమిటీ ఏర్పాటే చేయకూడదనేది వితండవాదం కాక మరేంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటూ చట్టం నచ్చక పోతే వివిధ ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనలు తెలపొచ్చు. పార్లమెంట్‌లో అడ్డుకోవచ్చు. లేదా న్యాయస్థానాలకు ఆశ్రయించొచ్చు. నిరసన తెలపడానికి అనేక మార్గాలున్నాయ్.

అంతేగాని కమిటీ ఏర్పాటు చేయకూడదు.. చేస్తే అది అంతా ప్రభుత్వ సానుభూతిపరులతో నిండిపోయిందని చెప్పడం నిజంగా విడ్డూరమే. కమిటీ దేశ వ్యాప్తంగా పర్యటించి రైతుల నుంచి అభిప్రాయలు సేకరిస్తే… అసలు ఢిల్లీ నడిబొడ్డులో రైతుల ముసుగులో చేసిన ఉద్యమం అసలు రంగు గుట్టువీడుతుంది. రైతు ఉద్యమం బూటకమని తేలిపోతుంది. అదే వీరి భయమా? పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు తప్ప దేశంలో ఏ ప్రాంతం రైతులు కూడా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకింoచలేదు. అసలు గుబులు అంతా ఇదే. కమిటీ పర్యటనలో ఉద్యమం నడిపిన నాయకుల మీద తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం.

చివరిగా ఒక్కమాట.. ఇప్పుడైనా రైతులకు లాభం చేకూర్చే చట్టాలను స్వాగతిద్దాం… రైతే రాజని నిరూపిద్దాం…

Dr G అజ్మతుల్లా ఖాన్
మదనపల్లె