NationalNews

సూపర్‌ స్టార్‌ కృష్ణకు ప్రముఖుల నివాళి

నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినీ రంగానికి సూపర్‌ స్టార్‌ కృష్ణ అందించిన సేవలు అమోఘం. 350కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఐదు దశాబ్దాల పాటు సినీ రంగాన్ని శాసించడం అద్వితీయం. కృష్ణ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం.

  • బిశ్వ భూషణ్‌ హరిచందన్‌, ఏపీ గవర్నర్‌

ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా గుర్తింపు పొందిన కృష్ణ నిజ జీవితంలోనూ మనసున్న మనిషిగా నిలిచారు. కృష్ణ మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను.

  • వైఎస్‌ జగన్‌, ఏపీ సీఎం

విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజలకు సామాజిక స్పృహ కలిగించే సాంఘిక చిత్రాల్లో నటించిన కృష్ణ జనాదరణ కలిగిన నటుడిగా నిలిచారు. నాటి కార్మిక, కర్షక లోకం ఆయన్ను సూపర్‌ స్టార్‌గా కీర్తించేది. సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమా రంగంలో కొత్త ఒరవడికి మార్గదర్శకులుగా నిలిచారు.

  • కేసీఆర్‌, తెలంగాణ సీఎం

కృష్ణ నటించిన పాత్రలు యువశక్తికి మారుపేరుగా నిలిచేవి. తెలుగు సినీ తెరపై ఆయన స్ఫూర్తి అజరామరం. ఘట్టమనేని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.

  • వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణించిన కృష్ణ గారి మృతి తీర్చలేనిది. తెలుగు సినిమాకు తొలి సాంకేతికను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణ గారు నిలుస్తారు. ఒక అద్భుత సినీ శకం ముగిసిందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. ఇటీవల తల్లిని కోల్పోయిన మహేశ్‌ బాబుకు ఇది తీరని ఆవేదనే.

  • చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

తెలుగు సినీ చరిత్రలో విభిన్న పాత్రలు పోషించడం.. సినిమా రంగంలో అన్ని స్థాయిల్లోనూ సేవలందించడం సూపర్‌ స్టార్‌ కృష్ణకే సాధ్యమైంది. కృష్ణ మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.

  • కేటీఆర్‌, తెలంగాణ మంత్రి

ఒక సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి.. ఒక సినీ శక్తిగా మారి.. పరిశ్రమలో సూపర్‌ స్టార్‌ స్థాయికి ఎదిగిన కృష్ణ గారి మృతి తీరని దుఖాన్ని మిగిల్చింది. వెండి తెరపై ఆయనకు ఎదురు లేదు. కృష్ణ గారి మృతికి తీవ్ర సంతాపం.

  • హరీశ్‌ రావు, తెలంగాణ మంత్రి

350కి పైగా సినిమాల్లో నటించి తెలుగు సినీ రంగానికి ఐదు దశాబ్దాల పాటు సేవలందించిన కృష్ణ గారు లేని లోటు తీర్చలేనిది. సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ ఆకస్మిక మృతి దిగ్ర్భాంతికరం.

  • తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రి

హీరో అనే పదాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న కృష్ణ.. నిజ జీవితంలోనూ హీరోనే. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు రూ.10 వేల విరాళంతో పాటు తన ఆదాయంలో 10 శాతం ఏడాది పాటు బాధితులకే ఇచ్చేశారు. మా నాన్న మండలి వెంకట కృష్ణారావుకు కృష్ణ మంచి మిత్రులు.

  • మండలి బుద్ధ ప్రసాద్‌, ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌

కృష్ణ వెండి తెరపైనే కాదు.. ప్రేమ, మానవత్వం, ఆప్యాయత పంచడంలో నిజ జీవితంలోనూ సూపర్‌ స్టార్‌. ఎందరికో కృష్ణ స్ఫూర్తి దాయకుడు. మమ్మల్ని మాత్రం అమితంగా ప్రేమించారు. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన లేకుండా గడపడం ఇక నుంచి రోజూ భారమే.

  • ఘట్టమనేని కుటుంబ సభ్యులు

సూపర్‌ స్టార్‌ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి.. ధైర్యానికి పర్యాయపదం. పట్టుదల, మానవత్వం కలబోత. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. నా సోదరుడు మహేశ్‌ బూబుకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

  • చిరంజీవి, సినీ నటుడు

కృష్ణతో నాది 60 ఏళ్ల అనుబంధం. 1956లో ఏలూరులోని సీఆర్‌ రెడ్డి కాలేజీలో ఇద్దరం కలిసి ఇంటర్మీడియెట్‌ చదివాం. మేమిద్దరం అప్పుడే మంచి మిత్రులమయ్యాం. సినిమా థియేటర్‌ కట్టాలని.. పడవలాంటి పెద్ద కారు కొనాలని కృష్ణ కలలు కనేవారు. ఆ కలలను నిజం చేసుకున్నారు కూడా. సినిమా సక్సెస్‌ అవుతుందో.. లేదో.. జడ్జ్‌ చేయడంలో ఆయన దిట్ట.

  • మురళీ మోహన్‌, సినీ నటుడు

కృష్ణతో కలిసి నేను నటించిన మూడు సినిమాలు నా జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇద్దరూ అసాధ్యులే, అన్నదమ్ముల సవాల్‌, రామ్‌ రాబర్ట్‌ రహీం.. ఈ మూడు చిత్రాల్లో కృష్ణ గారితో నటించడం నాకు దక్కిన గౌరవం. కృష్ణ మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.

  • రజనీకాంత్‌, సినీ నటుడు

లెజండరీ సూపర్‌ స్టార్‌.. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం కృష్ణ గారు. తెలుగు చిత్రాల్లో ఆయనే నిజమైన కౌబాయ్‌గా నిలిచారు. ప్రతి జానర్‌లోనూ సినిమా తీసే సాహసం చేసిన ఏకైక హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణ నిలుస్తారు.

  • నాగార్జున, సినీ నటుడు