Andhra PradeshHome Page Slider

ఈనెల 10న విచారణకు హాజరు కావాలని వైఎస్ అవినాష్ కు సిబిఐ నోటీస్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డిని ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండుసార్లు అవినాష్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఈనెల ఆరో తేదీన హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈనెల 4వ తేదీన పులివెందులలోని వైయస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాల వలన ఆరోజు విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. దీంతో సిబిఐ అధికారులు ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదివారం రాత్రి అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఆయన మూడోసారి సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. అలానే ఈనెల 12వ తేదీన వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై అవినాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సిబిఐ అధికారులు తనకు పదో తేదీన, తన తండ్రికి 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని ఈ మేరకు తాము హాజరు అవుతామని స్పష్టం చేశారు.