NewsTelangana

రేపు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ను విచారించనున్న ఈడీ

Share with

క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. చికోటి ప్రవీణ్, సంపత్ ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నేతలకు చికోటి ప్రవీణ్ బినామీగా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. క్యాసినో వ్యవహారంలో కోట్ల రూపాయలు హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. క్యాసినో క్యాంపు ముగిసిన తర్వాత గెలుచుకున్న ప్రైజ్ మనీని హవాలా రూపంలో అందజేసినట్లు తెలుస్తోంది. దందాలో పంటర్ల నుంచి కోట్ల రూపాయలను కమీషన్ల రూపంలో చికోటి ప్రవీణ్ వెనకేసుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియాలో 7 క్యాసినో క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆధారాలు ఈడీకి లభించాయ్. సోమవారం జరిగే ఈడీ విచారణలో ఎన్నో విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరోవైపు సైదాబాద్‌లో ప్రవీణ్ చికోటి ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పహారా కాస్తున్నారు. ఉదయం నుంచే ఇంటి సమీపంలో అనేక మంది గుర్తుతెలియని వ్యక్తులు సంచరించడంతో చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ అప్రమత్తమయ్యింది. సీసీటీవి కెమెరాల ద్వారా వ్యక్తులను కుటుంబ సభ్యులు పరిశీలించారు. సోమవారం ED ముందు ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి హాజరుకానున్న సమయంలో ఈ పరిణామం కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ రేపింది. ED ఆఫీస్ వరకు ప్రవీణ్‌కు భద్రత కల్పించాలని కుటుంబసభ్యుల డిమాండ్ చేస్తున్నారు. చికోటి ప్రవీణ్‌కు ప్రాణహాని ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇక రాజకీయ నాయకులతో సంబంధాలను ప్రవీణ్ బయటపెడతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.