Andhra PradeshNews

కేపిటల్ ఫైటింగ్… విశాఖలో అలజడి

◆ రైతుల పాదయాత్రను ఉత్తరాంధ్రపై దండయాత్రగా అభివర్ణిస్తున్న వైసీపీ నేతలు
◆ రాజీనామాలు చేసి ఉద్యమిస్తామని హెచ్చరికలు
◆ రైతులు తమ పీకలు కోయటానికి వస్తున్నారని ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం
◆ మూడు రాజధానులపై స్పీడ్ పెంచిన వైసీపీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
◆ ఈ అంశంపై ఏపీలోని అన్ని ప్రాంతాల ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ

ఏపీలో మూడు రాజధాని అంశం మరింత వేడెక్కింది. అన్ని ప్రాంతాల ప్రజల్లో ప్రస్తుతం దీనిపై విస్తృత చర్చ నడుస్తుంది. అమరావతిని రాజధానిగా ఉంచాలంటూ అక్కడ భూములు ఇచ్చిన 29 గ్రామాలకు చెందిన రైతులు దాదాపు వెయ్యి రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ మరోపక్క ఆయా గ్రామాల రైతులు పాదయాత్రలు చేస్తూ ప్రజలకు ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వస్తున్నారు. మొదట విడత తిరుపతి వరకు పాదయాత్ర చేసి, రెండో విడతగా అమరావతి నుండి అరసవల్లి పేరుతో యాత్రను 26 రోజుల క్రితం రైతులు ప్రారంభించారు. అమరావతి రైతుల యాత్రకు టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలుపాయి. అయితే అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ వైసీపి ఇంతవరకు ప్రకటనలు మాత్రమే చేస్తూ వచ్చింది. అయితే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజధాని అవుతుందని ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు హర్షిస్తూ వస్తున్నారు.

కానీ అన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతి రాజధానికే మద్దతు ఇవ్వటం మరోపక్క అమరావతి రైతులు అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తుండటం ఆ పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతుండటం, త్వరలోనే తూర్పుగోదావరి దాటి విశాఖపట్నం జిల్లాలో ప్రవేశించనున్న నేపథ్యంలో వైసీపీ నేతలు స్పీడ్ పెంచారు. ఉత్తరాంధ్రకు చెందిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల పాదయాత్రను ఉత్తరాంధ్రపై దండయాత్రగా అభివర్ణిస్తున్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశు సంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ తో పాటు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా మొన్నటి వరకు పాదయాత్ర పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. దీనిపై అదే స్థాయిలో టీడీపీ నాయకుల కూడా ప్రతి విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో తాజాగా గత మూడు రోజులుగా అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు మరింత స్పీడ్ పెంచుతూ తాము కూడా పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమిస్తామని ప్రకటనలు చేస్తుండటంతో రాజధానిపై ప్రజల్లో చర్చలు మరింత పెరిగాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు విశాఖ రాజధాని కాకూడదు అంటూ అమరావతి రైతులు అరసవల్లి వరకు వస్తే తాము ఊరుకోవాలా, మా పీకల కోయటానికి వస్తున్న వారిని శత్రువులు గానే భావిస్తామని ధర్మాన ప్రసాదరావు మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అవసరమైతే మూడు రాజధానుల కోసం తాము ఉద్యమిస్తామని ముఖ్యమంత్రి అనుమతిస్తే మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తామని కూడా అన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను వికేంద్రీకరణ సాధనకోసం ఏర్పడిన జేఏసీ ప్రతినిధులకు ఆయన అందజేశారు. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో రెండు మూడు మండలాల్లో మూడు రాజధానుల కోసం రిలే నిరాహార దీక్షల శిబిరాలను కూడా ప్రారంభించారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఉండేందుకు ఎవరు అడ్డుపడిన ఊరుకునేది లేదని అటువంటి వారిని తమ ప్రాంతంలో తిరగనియ్యమన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయటానికి కూడా తాము వెనకాడబోమని ప్రకటించడం, ఇప్పటికే ఒక ఎమ్మెల్యే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాకు సిద్ధపడటంతో వైసీపీ మూడు రాజధానుల కోసం ఎంతటికైనా సిద్ధపడినట్లు స్పష్టమవుతుంది. రైతుల పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించిన అనంతరం వైసీపీ నాయకులు ఇంకా ఏ తీరులో స్పందిస్తారన్నది అన్ని ప్రాంతాల ప్రజలలో ఉత్కంఠగా మారింది.