అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కేబినెట్ ఆమోదం
ఏపీ మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా క్యాబినెట్ భేటీ ఏర్పాటైంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కొత్త మంత్రివర్గం సమావేశమైంది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకొంది. వివాదానికి చిరునామాగా మారిన కోనసీమ జిల్లా మార్పుపై క్లారిటీ ఇచ్చేసింది. ఇక కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 3 గంటల పాటు సాగిన సమావేశంలో 42 ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈనెల 27న అమలు చేయనున్న అమ్మఒడి పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారుగా 44 లక్షల మంది తల్లుల ఖాతాలో అమ్మఒడి నిధులు పడనున్నాయ్. 15 వేల కోట్లతో ఏర్పాటుకానున్న అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. వీటితోపాటు వైద్య శాఖలో 3,530 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 216 కోట్లు మంజూరు చేసింది. జగనన్న ఎంఐజీ లే-అవుట్ల అభివృద్ధి పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. జులై నెలలో అమలు చేయనున్న జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకొంది.