NewsTelangana

మునుగోడులో టీఆర్‌ఎస్‌కు షాక్‌

బూర నర్సయ్య గౌడ్‌ రాజీనామాతో బీసీలు టీఆర్‌ఎస్‌కు దూరం?

బీజేపీలో బూర చేరనుండటంతో కమలం వైపు బీసీల మొగ్గు!

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మరికొంత మంది టీఆర్‌ఎస్‌ నేతలు

మునుగోడు, అక్టోబరు 15(మనసర్కార్‌): మునుగోడు ఎన్నికల నామినేష్ల ముగింపు రోజే టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలో బీజేపీలో చేరతారని తెలుస్తోంది. కొద్దిమంది అనుచరులతో ఇటీవల ఢిల్లీ వెళ్లిన నర్సయ్య గౌడ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్‌ ఛుగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమైనట్లు తెలిసింది. బూర రాజీనామాతో బీసీ ఓటర్లు.. ముఖ్యంగా గౌడ ఓటర్లు ఎక్కువగా ఉన్న మునుగోడులో ఆ వర్గం ఓటర్లు టీఆర్‌ఎస్‌కు దూరం అవుతారని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు. బూర బీజేపీలో చేరితే బీసీలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి.

మునుగోడు టికెట్‌ ఆశించి భంగపాటు..

డాక్టర్స్‌ జేఏసీ కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బూర నర్సయ్య గౌడ్‌ 2014లో టీఆర్‌ఎస్‌ తరఫున భువనగిరి ఎంపీగా గెలిచారు. 2019లో మాత్రం కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే మునుగోడు ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. బీసీ ఓటర్లు.. ముఖ్యంగా గౌడ ఓటర్లు ఎక్కువగా ఉన్న మునుగోడు టికెట్‌ ఇస్తే తన విజయం ఖాయమని చెప్పినా కేసీఆర్‌ మొండిచేయి చూపడంతో భంగపాటుకు గురయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. ఒకానొక దశలో బూర నర్సయ్య గౌడ్‌ను మునుగోడు బరిలో దించాలని టీడీపీ భావించింది. నర్సయ్య గౌడ్‌ మాత్రం అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందుకే సిద్ధమయ్యారు.  

స్పష్టమైన హామీతోనే బీజేపీలోకి..

కేసీఆర్‌ బుజ్జగింపుల తర్వాత కూసుకుంట్ల విజయానికి కృషి చేస్తానని నర్సయ్య గౌడ్‌ చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి హైదరాబాద్‌ నుంచి వచ్చిన బూర గురువారం కూసుకుంట్ల నామినేషన్‌ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అయితే.. ఆ ర్యాలీలో తనను కేటీఆర్‌ నిలబడిన వాహనంపైకి పిలవక పోవడంతో అసంతృప్తికి గురయ్యారు. కేటీఆర్‌తో కలిసి చండూరు వెళ్లిన బూర.. హైదరాబాద్‌ రాగానే మనసు మార్చుకున్నారు. బీజేపీలో బూర చేరడంలో శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ కీలక పాత్ర పోషించారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున భువనగిరి ఎంపీ టికెట్‌పై పార్టీ అధిష్టానం నుంచి స్వామిగౌడ్‌ హామీ ఇప్పించారని బూర అనుచరులు చెబుతున్నారు.

కర్నె, రవి, కర్నాటి కూడా బూర బాటలోనే..?

మునుగోడు టికెట్‌ ఆశించిన బూరను మంత్రి జగదీశ్‌ రెడ్డి సైతం అవమానించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక సన్నాహక సమావేశాలకు దూరంగా ఉంచడంతో బూర ఆవేదన చెందారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. గౌరవం లేని చోట మనసు చంపుకొని ఉండే బదులు పార్టీ మారాలన్న అనుచరుల ఒత్తిడితోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్‌తో పాటు పలువురు బీసీ నేతలు కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మునుగోడులో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన నారబోయిన రవి ముదిరాజ్‌, కర్నాటి విద్యాసాగర్‌తోనూ బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం.