Home Page SliderTelangana

గులాబీ మేనిఫెస్టో గుట్టు రట్టు

బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి పట్టించుకోని జనం
కేసీఆర్‌ నిన్ను నమ్మమంటున్న మెజార్టీ ప్రజలు
పథకాల విషయంలో నట్టేట ముంచాడన్న భావన
మళ్లీ గెలిస్తే ఇక అంతే సంగతులన్న టెన్షన్
సాలూ దొర.. ఇక చాలు అంటూ నినదిస్తున్న తెలంగానం
పేరు గొప్ప ఊరు దిబ్బ స్టైల్లో సీఎం కేసీఆర్ పథకాలు

చెప్పేది చేయరు. చేసేది చెప్పరు… కానీ దేశానికి రోల్ మోడల్ అంటూ బాకాలు ఊదుతారు. అనుకూల మీడియా ఊకదంపుడు ప్రకటనలతో ఇదే నిజం.. మీరు నమ్మాల్సిందేనంటూ కేసీఆర్ ప్రజలను మభ్యపెడతాడు. తిమ్మినిబమ్మి చేసి తెలంగాణ ప్రజలకు తాను లేకుంటే ఇకే ఏదీ జరగదని.. తాను సీఎం అయ్యాకే ప్రజల జీవితాలు మారాయంటూ కట్టుకథలు చెప్తాడు. మీడియాలో అవే ప్రకటనలు రిపీట్ చేస్తాడు. కానీ వాస్తవం తెలుసుకుంటే కేసీఆర్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నది అక్షర సత్యం. ఆయన పాలనలో అంతా దగా, పచ్చి మోసం తప్ప మేరేమీ లేదన్నది జగ్విదితం. అమలు చేయని పథకాలు అమలు చేస్తానంటూ చెప్పడం, జనాల్ని నమ్మించడం కేసీఆర్ గడుసుతనానికి నిదర్శనం. దేశంలో ఈ ఆర్ట్‌లో కేసీఆర్‌ను మించి మరో నాయకుడుండడంటే అతిశయోక్తి కాదు. కట్టుకథలు, అర్ధసత్యాలు చెప్పడంలో దేశంలోనే కేసీఆర్‌కు సాటి మరొకరు ఉండరు.

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దళిత బంధు గురించి ముచ్చట అసలే లేదు. మొత్తం మేనిఫెస్టోలో బెస్ట్ దళిత్ పాలసీ అన్న ముచ్చట తప్ప ఇక ఒక్క పదం కన్పించదు. హుజురాబాద్ ఉపఎన్నికలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ ఆ తర్వాత రాష్ట్రంలో ఆ పథకాన్ని అమలు చేసింది అంతంత మాత్రమే. కానీ తాను దళితజాతి ఉద్ధరకుడనంటూ భుజకీర్తులు చేయించుకుంటాడు. తన పాలనలోనే సుభిక్షంగా ఉన్నారని కల్లబొల్లి మాటలతో నమ్మపలుకుతాడు. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశంలోకెల్లా బెస్ట్ దళిత్ పాలసీని తెలంగాణలో అమలు చేస్తానంటూ మేనిఫెస్టోలో ప్రకటించి.. తన ముందుచూపును ప్రదర్శించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. దళితబంధు ఉంటుందో లేదో కూడా చెప్పలేదు. దళితులకు ఏం చేస్తాడో కూడా చెప్పలేదు. కేవలం బెస్ట్ దళిత్ పాలసీ అన్న మాటను తనకు అనుకూలంగా మలచుకునేందుకు మేనిఫెస్టోను సైతం వినియోగించుకుంటున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే.

సందర్భానుసారం మేనిఫెస్టోలో పథకాలు ప్రకటించడం తన నైజం అన్నట్టుగా మరోసారి కేసీఆర్ రుజువు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో దళితబంధు ఉంటుందా, ఉండదా ఏం చేస్తారని దానిపై అస్సలు క్లారిటీ లేదు. కేవలం మహిళలకు 3000 రూపాయలు భృతి, పింఛన్లను ఐదువేలకు పెంచడం, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇస్తానని చెప్పడం, ఆరోగ్య శ్రీ 15 లక్షల పెంపు, పేదలకు ఇండ్ల స్థలాలు, అగ్రవర్ణాలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, మహిళలకు సమాఖ్య సొంత భవనాలు, ఉద్యోగులకు సీపీఎస్‌పై అధ్యయన కమిటీ, అనాధ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ, ఎస్సైన్డ్ ల్యాండ్లను ఎవరి ఆధీనంలో ఉన్నవి వాళ్లకు ఇవ్వడం, మైనార్టీ వెల్ఫేర్ కోసం నిధులు కేటాయించడం మాత్రమే ప్రస్తుత మేనిఫెస్టోలో కేసీఆర్ పొందుపరిచారు. ఇక అడిగేవాడు లేడని తన ఇష్టారాజ్యంగా మొత్తం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు మేలు చేసేందుకు దళితబంధు తీసుకొచ్చానని చెప్పే కేసీఆర్… బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో దళితబంధు అమలు గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇటీవల బీసీబంధు అంటూ చాలా కథలు చెప్పిన కేసీఆర్.. దాన్ని కూడా మేనిఫెస్టో ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే ఎన్నికల్లో విజయం సాధిస్తే… ఏం చేస్తామో కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికల్లో గెలిపిస్తే చాలు అన్నీ ఇచ్చేస్తానన్న భ్రమను కల్పించి ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా వాతావరణం కన్పిస్తోంది. దేశంలో కెల్లా తాము గొప్ప పాలన సాగిస్తున్నామన్న బడాయి మాటలు తప్పించి చేయడానికి ఏమీ లేదన్నది తాజాగా బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే రుజువవుతోంది.