పడవ బోల్తా.. 20 మంది మృతి?
రక్షాబంధన్ సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన జరిగింది. తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు వెళ్తుండగా యమునా నదిలో వాళ్లు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పడవలో 35 మంది ఉన్నారని మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు భయపడుతున్నారు. మర్కా నుంచి ఫతేపూర్‌లోని జరౌలీ ఘాట్‌కు యమునా నదిలో వెళ్తున్న పడవలో 35 మంది ప్రయాణించారు. పడవ నది మధ్యలోకి వెళ్లగానే భారీ గాలి వీచిందని, ఈ సందర్భంగా ఏర్పడిన సుడిగుండంలో పడవ చిక్కుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బందితో నదిలో మునిగిపోయిన వారిని గాలిస్తున్నారు. ఈ ప్రమాదం పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.