ఎండ్లబండిపై అసెంబ్లీకి.. బీజేపీ వినూత్న నిరసన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. రోజుకు ఓ తీరుతో విపక్షాలు వినూత్నంగా నిరసనలకు దిగుతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ నేతలు లగచర్ల రైతుల అరెస్టు నిరసనగా బేడీలతో ఇటీవలే సభకు వచ్చారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించాలంటూ ఆ పార్టీ నేతలంతా ఆటోవాలా డ్రెస్సులు ధరించి అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఇవాళ రాష్ట్రంలోని రైతుల సమస్యలను తీర్చాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలంతా ఎడ్లబండిలో సభకు వెళుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయం లేదా అని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలకు మభ్యపెడుతోందని ఆరోపించారు. రైతు సమస్యలపై సర్కార్ కు కనువిప్పు కలగాలనే తాము ఇవాళ ఎండ్లబండిపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.

