NationalNewsNews AlertTelangana

మునుగోడు గడ్డపై నేడు బీజేపీ సమరభేరి

నిన్న ప్రజా దీవెన. నేడు సమర భేరి. రాజుకున్న రాజకీయ అగ్గితో మునుగోడు చురుక్కు మంటోంది. కొత్త చేరికలతో కమలదళంలో సందడి కనిపిస్తోంది. ఇవాళ అగ్రనేత అమిత్ షా అక్కడ కాలు పెట్టబోతున్నాడు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న ఆయన ముందుగా ఉజ్జయినీ మహంకాళీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కొందరు పార్టీ నేతలతోనూ .. రైతు సంఘాల ప్రతినిధులతోను  సమావేశం అవుతారు. అనంతరం బేగంపేట చేరుకునవి అక్కడ నుండి హెలికాప్టర్ లో మునుగోడు వెళతారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన సభలో పాల్గొంటారు. ఇందుకోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇదో ప్రతిష్టాత్మకం. పరువురు ప్రతిష్టల అంశం. గెలిచి తీరాలి. నిలిచి తీరాలి. జనం మనసుల్లో నిలిచి పోవాలి. ఇది కమల నాధుల వ్యూహం. రాజకీయ వాతావరణ పరిస్ధితులు అన్నీ అనుకూలంగానే ఉన్నాయని భావిస్తున్నారు. జనం తమ వెంటే ఉంటారని నమ్ముతున్నారు.

నిన్న ప్రజాదీవెనలో కమలనాధులను.. ముఖ్యంగా మోదీని టార్గెట్ చేసి కేసీఆర్ విమర్శలను ఎక్కుపెట్టారు. ఆయననే లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్ధాయిలో ఆరోపణలూ చేశారు. దీనికి ఇవాళ అమిత్ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చేందుకు బీజేపీ సన్నద్ధమైంది. ఎన్ని సభలు పెట్టినా .. ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పించినా విజయం మాత్రం తమదేనంటూ బీజేపీ ధీమా వ్యక్తే చేస్తోంది. ఎన్ని శక్తులు ఏకమైనా మునుగోడులో గెలుపు తమదే అంటోంది.

చండూరు మార్గంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలంతా మునుగోడులో మకాం చేసి అన్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీగా జన సమీకరణ జరుగుతోంది. ఇవాళ పార్టీలో కోమటి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే చేరతారని అంటున్నారు. సభా ప్రాంగణాన్ని కషాయ పతాకాలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. అమిత్ షాతో పాటు పలువురు నేతల భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో కనిపిస్తున్న స్పందన చూస్తే హుజూరాబాద్, దుబ్బాక ఫలితం ఇక్కడ కూడా పునారావృతం అవుతుందని కమలనాధులు బలంగా నమ్ముతున్నారు. బీజేపీతో ప్రజాస్వామ్య పాలన బలపడుతుందని, అభివృద్ధి చెందుతుందని భావించే తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మునుగోడు అభివృద్ధి కి కావాలనే నిధులు మంజురు చేయకుండా అడ్డుకున్నారని టీఆర్ఎస్ పై నిప్పులు కక్కారు.  ఏదేమైనా భారీ సభలతో మునుగోడులో పండగ వాతావరణం ఏర్పడింది. సందడి సందడిగా మారింది.