NewsTelangana

బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌జీకి హైకోర్టులో ఊరట

ఎలాంటి ఆధారాల్లేకుండా, కేవలం కొందరు వ్యక్తులు మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆధారంగా నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం ఏంటంటూ ఇప్పటికే బీజేపీ నేతలు, ఫామ్‌హౌజ్ వ్యవహారంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌‌జీకి హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 26న లేదంటే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు.

కేసును అత్యవసరంగా విచారించాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల సిట్ ముందు హాజరు రాలేకపోతున్నట్టుగా బీఎల్ సంతోష్‌జీ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఎమ్మెల్యేల ఎర కేసులో తనను అనవసరంగా తెలంగాణ సర్కారు ఇన్వాల్వ్ చేస్తోందని పిటిషన్‌‍లో సంతోష్‌జీ పేర్కొన్నారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని… సీఆర్‌పీసీ 41A నోటీసును రద్దు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. పిటిషన్ పై విచారించిన కోర్టు కేసును డిసెంబర్ 5కి వాయిదా వేసింది. అప్పటి వరకు సిట్ జారీ చేసిన నోటీసులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.