నాజీవితంలో ‘భారత్’ ముఖ్యమైన భాగం -మోదీతో కమలాహారిస్
భారతదేశం తనపై ఎంతో ప్రభావాన్ని చూపిందని, తను ఈనాడు అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎదగడానికి తన చిన్నతనంలో భారత్‌లోని తన తాతయ్య నేర్పిన పాఠాలే కారణమని ఆమె ప్రధాని మోదీకి వెల్లడించారు. శుక్రవారం మోదీ గౌరవార్థం ఆమె ఏర్పాటు చేసిన విందులో మోదీతో మాట్లాడుతూ భారతదేశంతో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు కమలా హారిస్. అమెరికాలో భారతీయ అమెరికన్లు ప్రభావాన్ని చూపిస్తున్నారని ప్రశంసించారు. తన చిన్నతనంలో తల్లితో పాటు చెన్నైలోని తాతయ్యను చూడడానికి వెళ్లేదాన్నని, తన అమ్మమ్మ, తాతయ్య తన జీవితంలో తనకెంతో ఇష్టమైన వ్యక్తులని ఆమె తెలిపారు. ఆయన సివిల్ సర్వెంట్‌గా రిటైర్ అయ్యారని, ఆయనతో ప్రతిరోజూ బీచ్‌లో నడిచేటప్పుడు ఆయన స్నేహితులతో దేశంలోని ఆనాటి సమస్యల గురించి మాట్లాడేవారని, తాను కూడా ఆసక్తిగా వినేదాన్నని తెలియజేశారు. ఆ సంభాషణలే తన ఆలోచనలను ప్రభావితం చేసాయన్నారు. తన తల్లి శ్యామల, తన తాత పి.వి. గోపాలన్ గార్లు ప్రజాస్వామ్యానికి అర్థం తెలిపి దానికి కట్టుబడి ఉండడం నేర్పించారని, ఆ మాటలే తనను ప్రజాసేవ వైపు నడిపించాయని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచశక్తిగా మార్చడంలో నరేంద్రమోదీ పాత్రకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. క్వాడ్‌ను పునరుద్ధరించారని, జీ20 లో మీ నాయకత్వం అసమానమని, ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లకు సులువైన పరిష్కారాలు చూపిస్తున్నారని ఆమె ప్రశంసించారు.

