ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని వేడుకున్నా..
మాట వినకపోవడం వల్లే అధికార బదలాయింపు
నందమూరి కుటుంబం, టీడీపీ ఉమ్మడి నిర్ణయమే
బాలకృష్ణతో టాక్ షోలో 1995 నాటి ఘటనపై చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. జగన్ తన తండ్రి, కాంగ్రెస్ నేత వైఎస్సార్ పేరుతో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే.. చంద్రబాబు తన మామ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరుతో మళ్లీ అధికారం చేజిక్కుంచుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఎన్టీఆర్ పేరును తగ్గించేసి.. వైఎస్సార్ పేరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్ మారిస్తే.. వాస్తవాన్ని వెల్లడించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్న ముద్రను చెరిపేసుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో వేదికగా ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానం, 1995లో టీడీపీని, సీఎం పీఠాన్ని ఎన్టీఆర్ నుంచి చేజిక్కించుకునేందుకు తలెత్తిన పరిస్థితిని, ఎన్టీఆర్‌ను మార్చేందుకు తాను పడిన తాపత్రయాన్ని చంద్రబాబు వివరించారు.

బయటి వ్యక్తి జోక్యంతో ఎన్టీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని ఆయన కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారని 1995 నాటి సంఘటనను చంద్రబాబు ఈ షోలో గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్‌కు నచ్చజెప్పేందుకు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణతో కలిసి తాను ఆయన గదిలోకి వెళ్లానని.. ఎన్టీఆర్‌తో పాటు బీవీ మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పారు. ‘మీతో మాట్లాడాలి’ అని ఎన్టీఆర్‌తో అంటే.. కుటుంబమా.. రాజకీయమా.. అని ఎన్టీఆర్ అడిగారని చంద్రబాబు చెప్పారు. రాజకీయమే అంటే.. హరికృష్ణ, బాలకృష్ణను బయటికి పంపించి.. తనతో మాట్లాడారని చంద్రబాబు వివరించారు. నాటి ఘటనలో ఇప్పుడు ఇద్దరే బతికి ఉన్నారని తెలిపారు. దీంతో.. ఆ రోజు సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది అని బాలకృష్ణ చెప్పారు.

ఎన్టీఆర్ తనకు ఆరాధ్య దైవమని.. పార్టీని, అధికారాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దని కోరానని.. గందరగోళంలో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని కాళ్లు పట్టుకొని మరీ వేడుకున్నానని.. అయినా ఎన్టీఆర్‌లో మార్పు రాలేదని చంద్రబాబు ఆవేదనతో చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని తాను తీసుకున్న నిర్ణయం తప్పా..? అని బాలకృష్ణను చంద్రబాబు అమాయకంగా అడిగారు. అది ‘నారా-నందమూరి-టీడీపీ’ కలిసి తీసుకున్న నిర్ణయమని, చంద్రబాబు చేసినది ఏమాత్రమూ తప్పుకాదన్న విషయాన్ని 1999 ఎన్నికలే నిరూపించాయని బాలకృష్ణ స్పష్టం చేశారు.

ఎన్టీఆర్‌ను తొలిసారి ఎప్పుడు కలిశారని చంద్రబాబును బాలకృష్ణ అడిగారు. ‘నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా (అంజయ్య కేబినెట్‌లో) ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ను కలవాల్సిన అవసరం ఏర్పడింది. రామకృష్ణ స్టూడియోకు రావాలని ఆయన చెప్పారు. “అనురాగ దేవత” అనే సినిమా చిత్రం షూటింగ్ విరామంలో మూడు గంటలకు పైగా మాట్లాడానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్సార్‌తోనూ తనకు మంచి స్నేహం ఉండేదని, టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆయనతో రాజకీయ విభేదాలు తలెత్తాయని చంద్రబాబు వివరించారు. ఆహాలో ప్రసారమైన ఈ షో వైరల్ అయింది.

మొత్తానికి.. తమ హయాంలో ఎదురులేని శక్తిగా నిలిచిన ఎన్టీఆర్, వైఎస్సార్.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ ఓట్లు రాల్చే వ్యక్తుగా నిలిచారు. రానున్న ఎన్నికల్లో ఆ ఇద్దరు మహానుభావుల చుట్టే రాజకీయాలు నడపాలని రెండు ప్రధాన పార్టీల అధినేతలు ప్రయత్నించడమే దీనికి నిదర్శనమని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ అంటే తనకు అభిమానం అని వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా అనడం.. వైఎస్సార్ తనకు మంచి స్నేహితుడని చంద్రబాబు టాక్ షో సాక్షిగా చెప్పడం ఆశ్చర్యం కలిగించడం లేదని ఆ ఇద్దరు మహానుభావుల అభిమానులు అనుకుంటున్నారు.

