Home Page SliderInternationalNews AlertPolitics

చైనాతో దోస్తీకి రెడీ అవుతున్న బంగ్లాదేశ్..

భారత్‌తో కయ్యానికి దిగుతున్న బంగ్లాదేశ్ చైనాతో సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతోంది. దోస్తీకి రెడీ అయినట్లు సిగ్నల్స్ పంపుతోంది. చైనా అత్యధిక పెట్టుబడులు పెడితే తమ దేశ ఆర్థికవ్యవస్థ మలుపు తిరుగుతుందని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. చైనా- బంగ్లా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన సదస్సును యూనస్ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ఇన్వెస్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి చైనా వాణిజ్యమంత్రి వాంగ్ వెంటావో ప్రత్యేకఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా యూనస్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తయారీరంగంలో చైనా కంపెనీలు పేరుగాంచాయన్నారు. చైనాతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. తమ దేశంలో బీజింగ్ పెట్టుబడులు పెడితే దేశ ఆర్థికవ్యవస్థ మలుపు తిరుగుతుందన్నారు. ఇక, దేశ ఆర్థికవృద్ధిని మెరుగుపరిచి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా తాము ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడులు మెరుగుపరచడం, చట్టాలను క్రమబద్ధీకరించడం, వ్యాపార కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈసందర్భంగా బంగ్లాదేశ్ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని చైనా కంపెనీలకు సూచించిన ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌కు యూనస్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల చైనాలో యూనస్ నాలుగురోజుల పాటు పర్యటించి, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. డ్రాగన్ ఇస్తున్న రుణాలకు వడ్డీని తగ్గించాలని, ప్రాజెక్టులకు కమిట్‌మెంట్ ఫీజును మాఫీ వేయాలని కోరారు. తీస్తానది నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టులలో కూడా పాల్గొనడానికి చైనా కంపెనీలను బంగ్లాదేశ్ స్వాగతించింది.