IT నగరాలను కలిపే HI SPEED రైళ్లు -బెంగళూరు హైదరాబాద్ ప్రయాణం 2 గంటలే
మనం కేవలం రెండున్నర గంటల్లో హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లగలమా.. ఇప్పటి పరిస్థితుల్లో విమానంలో అయితేనే ఇది సాధ్యమవుతుంది. కానీ సమీప భవిష్యత్తులో రైల్లోనే 2.5 గంటల్లో చేరుకోగలిగే అవకాశాలున్నాయి. దక్షిణాదిలో IT రంగంలో దిగ్గజాలైన ఈ రెండు మహానగరాల మధ్య అనుసంధానం చేసేలా భారతీయ రైల్వే కొత్త ప్రాజెక్టు ప్రవేశపెడుతోంది. సెమీ హైస్పీడ్ ట్రాక్ ఏర్పాటు చేసి హైస్పీడ్ ట్రైన్లను నడపబోతోంది. బెంగళూరు, హైదరాబాద్ మధ్య ప్రతినిత్యం వేలాదిమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రోడ్డు,రైల్వే మార్గాలలో కనీసం 10 గంటల సమయం పడుతోంది. ఈ హైస్పీడ్ ట్రాక్ నిర్మాణానికి కావలసిన రూట్ ఇప్పటికే నిర్ణయించారు. ట్రాక్‌కు ఇరువైపులా 1.5 మీటర్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఎలాంటి అడ్డంకులు లేకుండా హైస్పీడ్‌తో దూసుకుపోయేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కొత్త ట్రాక్ బెంగళూరులోని యెలహంక నుండి సికింద్రాబాద్ స్టేషన్ వరకూ 503 కిలోమీటర్లు నిర్మించబోతున్నారు. దీనికి సుమారు 30 వేల కోట్లు ఖర్చు కానుంది. PM GATI పథకంలో భాగంగా ఈ నిర్మాణం జరుగుతుంది. ఇండియా ఇన్‌ఫ్రాహబ్ నివేదిక ప్రకారం సెమీ హైస్పీడ్ ట్రాక్‌ను గంటకు 200 కిలోమీటర్ల దూరంతో వెళ్లేలా రూపొందించనున్నారు. ఇదేకాక బెంగళూర్-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై కూడా నిర్ణయం జరగనున్నట్లు ఇటీవల కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేసారు.

