NationalNews

దగ్గుమందుపై నిషేధం భారత్‌కు సిగ్గుచేటు

భారత్‌లో తయారైన దగ్గుమందు జాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైందని ఆఫ్రికా ఆరోపించడం మన దేశానికి సిగ్గు చేటని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. బెంగళూరులో నిన్న నిర్వహించిన ఇన్ఫోసిస్‌ సైన్స్‌ పురస్కారాల కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… కరోనా టీకాలు అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసిన మనకు ఈ అపవాదు మచ్చ తీసుకొచ్చిందన్నారు. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న గున్యా, డెంగీలకు ఇప్పటి వరకు టీకాలు కనుగొనకపోవడం పరిశోధన రంగం వైఫల్యమేనని నారాయణమూర్తి తెలిపారు. విజ్ఞాన పరిశోధనల్లో సమన్వయ లోపంతోపాటు నిధులు పొందడంలో విద్యాసంస్థలు అవస్థలు పడుతున్నాయన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సకాలంలో పొందలేకపోతున్నాయని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.