త్యాగాల పండుగ బక్రీద్..ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
జూన్ 7న బక్రీద్ పండుగ ముస్లిం సోదరులకు అపూర్వమైన పండుగ. దీనిని త్యాగానికి ప్రతిరూపంగా జరుపుకుంటారు. హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా సమాజంతో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘంగురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది పండుగ. ముస్లింలు ఏటా మక్కా వెళ్తారు. అక్కడ ఖుర్బానీ ఇస్తారు. పండుగకు ముందురోజైన ‘యౌమె అరఫా’ నాడు ఉపవాసం పాటిస్తే.. వారు గత సంవత్సరం చేసిన పాపాలు క్షమకు నోచుకుంటాయని ప్రవక్త తెలియజేశారు.

