Telangana

పవిత్రోత్సవాలతో శోభిల్లిన వరంగల్ భద్రకాళి ఆలయం

Share with

చల్లని తల్లి ఆ జగదంబ ఒక్కొక్క ఊరిలో ఒక్కోపేరుతో భక్తుల పూజలందుకుంటుంది. వరంగల్‌లోని శ్రీభద్రకాళిగా పిలువబడే అమ్మవారికి గత మూడురోజులపాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. నిన్న ఆఖరి రోజు పైగా శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రంగురంగుల పవిత్రాలను అమ్మవారికి అలంకరించారు.  ఈ ఉత్సవాల వల్ల లోకకళ్యాణం జరుగుతుందని, భక్తుల సంపాదన పెరుగుతుందని ప్రధాన అర్చకులు శేషు తెలియజేసారు. దేవాలయంలోని అర్చకులు, అధికారులు, భక్తులు ఎవరైనా తెలిసీ, తెలియక ఏదైనా అపచారం చేసినట్లయితే వాటివల్ల సంక్రమించే పాపాలు కూడా ఈ పవిత్రోత్సవం వల్ల తొలగిపోతాయని భక్తుల నమ్మకం. నిన్న శ్రావణపౌర్ణమి పైగా రాఖీ పండుగ కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.  ప్రభుత్వ చీఫ్  విప్ దాస్యం వినయభాస్కర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా ఆయన 33వేల రూపాయల విరాళాన్ని అందజేసారు.  వేలాదిమంది భక్తులకు పూజారులు రక్షాబంధనం చేసారు. ఇంకా వరంగల్ ఎంజీయం కూడలిలోని శ్రీరాజరాజేశ్వరాలయం, హంటర్ రోడ్‌లోని సంతోషిమాత, హనుమకొండలోని పద్మావతి అమ్మవార్లకు మహిళలు ఒడిబియ్యం సమర్పించుకున్నారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.