అవినాశ్ విచారణకు రాకపోతే లొంగిపోవాలి-సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారణకు రాలేకపోతే లొంగిపోవాల్సి వస్తుందని హెచ్చరికలు పంపుతోంది సీబీఐ. గత మూడు దఫాలుగా సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ హైదరాబాద్ నుండి పులివెందుల బయల్దేరిన ఆవినాశ్ రెడ్డి తన తల్లితో పాటు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఉంటున్నారు. ఆమెకు గుండె సంబంధిత చికిత్స అవసరం కావడంతో అన్ని రకాల పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీబీఐకి విచారణకు రాలేనంటూ లేఖ రాశారు. అయితే ఈ రోజు విచారణకు రావాల్సి ఉండగా, అవినాశ్ రెడ్డి రాకపోవడం వలన సీబీఐ అధికారులే కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి పరిసరాలకు చేరుకోవడంతో ఏంజరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. అవినాశ్ అనుచరులు చాలామంది ఆసుపత్రి పరిసరాలను ఆక్రమించారు. మీడియా వర్గాల వారిని రానీయకుండా అడ్డుకుంటున్నారు. ఆ పరిసరాలలో దుకాణాలను కూడా తెరిచేందుకు అనుమతించడం లేదు. మరోవైపు సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీతో చర్చలు జరుపుతున్నారు. అవినాశ్ లొంగిపోతే మంచిదని వివరిస్తున్నారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆసుపత్రి వెలుపల, లోపల పోలీసులు పహారా కాస్తున్నారు. ఎప్పుడైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

