భౌగోళిక గుర్తింపు పొందనున్న ఆత్రేయపురం పూతరేకులు
తెల్లని పల్చటి పేపర్ లాంటి ఆకారం, మడతల మధ్యలో కమ్మటి నెయ్యి, చక్కెర పొడి, జీడిపప్పులతో చూస్తేనే నోరూరించే పూతరేకులు నచ్చనివారుండరు. అద్భుతమైన రుచితో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఆత్రేయపురం పూతరేకులకు త్వరలోనే భౌగోళిక గుర్తింపు రానుంది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఈ పూతరేకులకు భౌగోళిక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే దీనికి గెజిట్ రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మధ్యనే హైదరాబాద్ బిర్యానీకి భౌగోళిక గుర్తింపు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

