ఇంటికొచ్చి విచారించాలని అడిగా.. కానీ ఈడీ ఆఫీస్‌కు రమ్మన్నారు:కవిత
ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికొచ్చి విచారించాలని చట్టం చెబుతోందన్నారు. 11న మా ఇంటికి రావాలని ఈడీ అధికారులను కోరానన్నారు. కానీ వారు అందుకు ఒప్పుకోలేదన్నారు. ఈడీ కార్యాలయానికి రావాల్సిందేనని స్పష్టం చేశారన్నారు. కావాలంటే నిందితుల్ని ఇంటికి తీసుకొచ్చి విచారించాలని కోరినా… కుదరదన్నారన్నారు. తనతో పాటు ఎవర్ని విచారించినా ఇబ్బంది లేదన్నారు కవిత. దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. అధికారంలో లేని రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ వస్తోందన్నారు కవిత. ఇది తన ఒక్కరి సమస్య కాదన్నారు. ఈడీ ఎందుకంత హడావుడిగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదన్నారు. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరని ప్రశ్నించారు కవిత. దర్యాప్తు సంస్థలు ఇంటికి వచ్చి విచారించాలని చట్టం చెబుతోందని కవిత తెలిపారు.


