అవినాశ్ కేసులో వాదనలు పూర్తి-బెయిల్‌పై తీర్పు వాయిదా
వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో తెలంగాణా హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. వాడిగా, వేడిగా రెండురోజుల పాటు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మే 31కి వాయిదా వేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వు ప్రకారం వెకేషన్ బెంచి న్యాయమూర్తి జస్టిస్ ఎం. లక్ష్మణ్ వాదనలు విన్నారు. అవినాష్ రెడ్డి లాయర్‌తో పాటు ఆయనకు బెయిల్ ఇవ్వకూడదంటూ వివేకా కుమార్తె సునీత తరపున లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు. ఈ రోజు వారితో పాటు సీబీఐ తరపున కూడా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ సీబీఐ విచారణకు అవినాష్ సహకరించడం లేదంటూ తమ వాదనలు వినిపించారు. దర్యాప్తును పద్దతి ప్రకారం జరగనీయకుండా జాప్యం చేస్తున్నారని, లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపణలు చేసారు.

దీనికి సామాన్యుల కేసుల్లో కూడా ఇలాగే సమయం తీసుకుంటారా అంటూ సీబీఐ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. హత్యకు ప్రధానకారణమేంటని ప్రశ్నించగా, రాజకీయ ఉద్దేశ్యాలే కారణమంటూ బదులిచ్చారు. హత్యకు నెల రోజుల ముందునుండే కుట్ర పన్నారని, కడప ఎంపీ టికెట్ షర్మిలకు కానీ విజయమ్మకు గానీ ఇమ్మని వివేకానందరెడ్డి అడిగారని, కానీ అవినాశ్‌కు ఇవ్వాలనే ఉద్దేశంతో కుట్ర జరిగిందని తెలిపారు. ఈ కేసులో వాదోపవాదాలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. అవినాశ్ తరపు లాయర్ మాట్లాడుతూ అవినాష్‌కు ఈ హత్యతో సంబందం లేదన్నారు. దీనితో బెయిల్ పిటిషన్‌పై తీర్పును 31 వరకు వాయిదా వేసింది. అంతవరకు అవినాష్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

