రేవంత్ ‘రెడ్డి’ వ్యాఖ్యలే కాంగ్రెస్ కొంప ముంచనున్నాయా?
కాంగ్రెస్ పార్టీ ముందెన్నడూ లేనంతగా ఇప్పుడు భావదారిద్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీకి దిశానిర్దేశం లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాల తరబడి పార్టీని అంటిపెట్టుకున్న నేతలను… పార్టీని పట్టించుకోకపోవడం… కులాల మధ్య కుంపట్లు రాజేస్తోండటంతో పుట్టుకో గొడుగులా నేతలు దారులు వెదుక్కుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయ్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుతో విసిగిపోయిన నాయకగణం ఒక్కొక్కరు పార్టీ వీడాలని నిర్ణయానికి వస్తోన్నట్టుగా కన్పిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేసిన శ్రవణ్ గుడ్‌బై చెప్పారు. పార్టీలోని నియంతృత్వ పోకడలతో విసిగిపోయానన్నారు. కేసీఆర్ పై ధిక్కారం ప్రకటించి సామాజిక తెలంగాణ కోసం హస్తం పార్టీలో చేరితే… అక్కడ కులహంకారం ఎక్కువైపోయిందని అసహనం వ్యక్తం చేశారు శ్రవణ్.
ఐతే శ్రవణ్ పార్టీని వీడటానికి కారణాలు అనేకం కన్పిస్తున్నాయ్. ఇటీవల అఖిల భారత రెడ్డి కుల సమావేశంలో.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు… కాంగ్రెస్ పార్టీలోని అన్ని వర్గాల నాయకులను కలచివేశాయ్. రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ వారికి నిద్రలేకుండా చేశాయ్. పార్టీలను కాపాడుకోవాలన్నా.. పార్టీలను నిలబెట్టుకోవాలన్నా… పార్టీలు ఎన్నికల్లో గెలవాలన్నా… రెడ్ల చేతిలో పార్టీలను పెడితేనే సాధ్యమంటూ ఓ రేంజ్‌లో రేవంత్ మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీలోని బడుగు బలహీనవర్గాల నేతలకు పిడుగు పడినట్టయ్యింది. రెడ్లు మాత్రమే రాజ్యాధికారం చేయగలుగుతారన్న వ్యాఖ్యలతో కలకలం రేగింది. మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా… రెడ్ల నీడలో బతకాల్సిందేనన్నట్టుగా ఆయన పరోక్ష కామెంట్స్ చేశారు. వాస్తవానికి… తెలంగాణ సమాజంలో బహుజనులు కీలకం. వివిధ కులాల సమాహారం ఇది. ఇక్కడ అగ్రకులాలైన కమ్మ, వెలమ, బ్రహ్మణ, వైశ్య, రెడ్డి వంటి సామాజికవర్గాలు… అన్నీ కలిపి 20 శాతం లోపు మాత్రమే ఉన్నాయ్. రెడ్డి సామాజిక వర్గం నామమాత్రమేనని చెప్పాలి. అనేక సంవత్సరాలుగా రాజ్యాధికారం రెడ్ల చేతిలో ఉన్నందున… గ్రామ నాయకత్వం… రెడ్డి సామాజిక వర్గం చేతిలో కేంద్రీకృతమైపోయింది.
తెలంగాణ వచ్చి పదేళ్లయినా బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికార దక్కలేదన్న భావనతో… తెలంగాణలో బీసీలంతా ఏకమవుతున్నారు. రాజ్యాధికారం సాధించాలని బీసీలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి.. రెడ్లు మాత్రమే రాజకీయాలు చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయ్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది బీసీ నేతల మనోభావాలను దెబ్బతీశాయ్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే… సీనియర్ నాయకులు, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ … నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు. సాధించుకున్న తెలంగాణ… సామాజిక తెలంగాణ కావాలని కోరుకుంటున్నట్టుగా మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని పెద్ద దిక్కుగా భావిస్తున్న తరుణంలో… అన్ని పార్టీలకు రెడ్లు మాత్రమే నాయకత్వం వహిస్తే మనుగడ ఉంటుందని చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి అన్నారు. వ్యక్తిగతంగా మీకు, పార్టీకి ఈ వ్యాఖ్యలు తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు రగిలిపోతున్నారన్నారు. బహుజన వర్గాలన్నీ ఖండిస్తున్నాయన్నారు.
పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మేమెంతో… మాకంతా అంటూ డిమాండ్ చేస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. మీ భాష, యాస అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా.. అవమానపరిచేలా ఉందని విరుచుకుపడ్డారు. బడుగుల, బలహీనవర్గాల మనోభావాలను దెబ్బతీసేలా పీసీసీ అధ్యక్ష హోదాలో మాట్లాడడం తగదన్నారు మధుయాష్కీ. పీసీసీ అధ్యక్షుడికి పర్సనల్, పబ్లిక్, ప్రైవేట్ అంటూ ఏమీ ఉండదని… మీరు ఎక్కడ మాట్లాడిన వాటిని పీసీసీ చీఫ్ గానే ప్రజలు భావిస్తారన్నారు. వెంటనే ప్రకటనను వెనక్కి తీసుకోవాలని… పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో ఏర్పడే ఆందోళనను పోగొట్టాలని డిమాండ్ చేశారు. రెడ్డి సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ముఖ్యులంతా తూర్పారబట్టారు. బీసీ నేతలు… పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, దాసోజు శ్రవణ్ కుమార్ లాంటి నేతలు రేవంత్ తీరును మీడియా వేదికగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కుతకుతలాడారు. కాంగ్రెస్ పార్టీని వీడాలనుకున్న నేతలు… సందర్భం చూసి బయటపడదామనుకుంటున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డి నిష్క్రమణ ఒక ఆయుధంలా దొరికింది. రేవంత్ రెడ్డి తీరును, బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాసోజు శ్రవణ్ కుమార్‌తోపాటు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎందరో బీసీ నేతలు ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నేతలు కాంగ్రెస్ పార్టీ వీడటానికి కారణాలేవైనా.. రేవంత్ రెడ్డి కుల వ్యాఖ్యలేనన్నది బహిరంగ రహస్యం.