పంజాబ్ కేబినెట్‌లో మరో మంత్రి రాజీనామా..
పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంలో మరో వికెట్ పడింది. అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో ఫౌజాసింగ్ సరారీ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఆయన రాష్ట్ర కేబినెట్‌లో ఉద్యానవన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తాను పార్టీకి నమ్మకమైన సైనికుడినని, పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే.. తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన కొన్ని నెలల్లోనే రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఓఎస్డీ తర్సెమ్ లాల్ కపూర్‌తో మాట్లాడిన ఓ ఆడియో వెలుగులోకి రావటం మంత్రిని ఇరుకునపెట్టింది. ఆహారధాన్యాల కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకునే విషయంపై ఇరువురు మాట్లాడుకున్నట్లు ఆ ఆడియోలో బయటపడింది. దీంతో మంత్రితోపాటు ప్రభుత్వం విపక్షాలు విమర్శలు చేశాయి. ఫౌజాను కేబినెట్ నిం తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఆ ఆరోపణలును ఫౌజా ఖండించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం భగవంత్ మాన్‌కు పంపించారు. రాజీనామా పత్రం అందుకున్న వెంటనే సీఎం ఆమోదించినట్లు సమాచారం.

