టర్కీని వణికించిన మరో భూకంపం
మరో భూకంపం సోమవారం టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతాన్ని వణికించింది. ఇటీవల భూకంపంతో 47,000 మందికి పైగా మరణించిన ఘటన మరువక ముందే… మరో భూకంపం విరుచుకుపడింది. వందల వేల గృహాలు ధ్వంసం అయిన తర్వాత మరో భూకంపం రావడంతో జనం బెంబేలెత్తిపోయారు. సోమవారం నాటి భూకంపం 6.4 తీవ్రతతో, దక్షిణ టర్కిష్ నగరం అంటాక్యా సమీపంలో కేంద్రీకృతమైంది. సిరియా, ఈజిప్ట్ మరియు లెబనాన్‌లలో సంభవించింది. ఇది 10 కి.మీ లోతులో కేంద్రీకృతమైనట్టు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. తాజా భూకంపం తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న కొంతమంది వ్యక్తుల గురించి తనకు నివేదికలు అందాయని హటే మేయర్ లుత్ఫు సవాస్ హేబర్‌టర్క్ బ్రాడ్‌కాస్టర్‌తో చెప్పారు. తాజా భూకంపం దాటికి ముగ్గురు వ్యక్తులు మరణించగా… 200 మందికి పైగా గాయపడ్డారని అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు చెప్పారు.

తాజా భూకంపంతో టర్కీ వాసులు బెంబేలెత్తిపోయారు. అల్ ఒమర్ మాట్లాడుతూ, తాను సెంట్రల్ అంటాక్యాలోని ఒక పార్క్‌లోని టెంట్‌లో ఉన్నానని, ఆ సమయంలో భూమి మళ్లీ కదలడం ప్రారంభించిందని.. దీంతో భయం వేసిందన్నాడు. కాళ్ళ క్రింద భూమి చీలిపోతుందని నేను అనుకున్నానంటూ ఓ మహిళ 7 ఏళ్ల కొడుకును చేతుల్లో పట్టుకుని ఏడుస్తూ చెప్పింది.

అంతకు ముందు U.S. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ టర్కీ పర్యటనలో మాట్లాడుతూ, ఫిబ్రవరి 6 భూకంపం, దాని అనంతర ప్రకంపనల నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌లకు వాషింగ్టన్ సాహయం, పునర్నిర్మాణ చర్యలు కొనసాగిస్తుందన్నారు. రెండు వారాల క్రితం టర్కీలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 41,156కి పెరిగిందని టర్కీ అధికారులు చెప్పారు. 3,85,000 అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయని , తీవ్రంగా దెబ్బతిన్నాయని… చాలా మంది ఇప్పటికీ తప్పిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. టర్కీలోని భూకంప ప్రభావిత 11 ప్రావిన్సుల్లో దాదాపు 200,000 అపార్ట్‌మెంట్ల నిర్మాణ పనులు వచ్చే నెలలో ప్రారంభమవుతాయని అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. టర్కీ, సిరియాలో భూకంప బాధితుల కోసం అమెరికా సాయం $185 మిలియన్లకు చేరుకుందని U.S. స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. భూకంపాల నుండి బయటపడిన వారిలో 3,56,000 మంది గర్భిణీ స్త్రీలు అత్యవసర ఆరోగ్య సేవలను పొందాల్సి ఉందని U.N. తెలిపింది. వీరిలో టర్కీలో 2,26,000 మంది, సిరియాలో 1,30,000 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 38,800 మంది వచ్చే నెలలో ప్రసవించనున్నారు. వారిలో చాలా మంది శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. లేదా గడ్డకట్టే ఉష్ణోగ్రతలతో తల్లడిల్లుతున్నారు. ఆహారం, స్వచ్ఛమైన నీటిని పొందడానికి అష్టకష్టాలుపడుతున్నారు.

