Home Page SliderTelangana

నారాయణఖేడ్‌లో ఆయన విజయం ఖాయమా?

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభంజనం. కానీ ఇప్పుడు సీన్ మారుతోందా అన్నట్టుగా పరిణామాలు కన్పిస్తున్నాయ్. గత రెండు ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించ సిట్టింగ్ అభ్యర్థి భూపాల్ రెడ్డి మరోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో నారాయణ్ ఖేడ్ నుంచి భూపాల్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించగా ఈసారి అక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి వాస్తవానికి సురేష్ షెట్కర్‌కు పార్టీ తొలుత అవకాశం ఇచ్చింది. అయితే అక్కడ అభ్యర్థి మార్పు తప్పదన్న భావనకు వచ్చిన పార్టీ హైకమాండ్… చివరకు సంజీవరెడ్డికి చాన్స్ ఇచ్చింది. అది కూడా షెట్కార్ ఆమోదంతో చేయడం విశేషం. విలక్షణ నియోజకవర్గంగా పేరున్న ఇక్కడ ఈసారి బీజేపీ అభ్యర్థిగా జర్నలిస్ట్ సంగప్ప సైతం బరిలో దిగారు. లింగాయ్‌లు ప్రముఖంగా ఉండటంతో ఇక్కడ బీజేపీ గెలుపుపై విశ్వాసంతో ఉంది. మొత్తానికి నారాయణ ఖేడ్ ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చూడాలి.

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 296. పరుష ఓటర్లు 1,14,570, మహిళా ఓటర్లు 1,12,654 కాగా 8 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లు 2,27,232 ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనూ ముదిరాజ్ ఓటర్లు 16 శాతానికి పైగా ఉన్నారు. ముస్లింలు 12 శాతం వరకు ఉండగా, లింగాయత్‌లు 10 శాతం, లంబాడాలు 10 శాతానికి చేరువగా ఉన్నారు. గొల్లలు ఏడున్నర శాతం, రెడ్లు ఆరున్నర నుంచి ఏడు శాతం మేర ఉన్నారు. మాలలు 6 శాతానికి పైగా ఉండగా, మరాఠాలు ఇక్కడ సుమారుగా 4 శాతం మేర ఓటర్లున్నారు. పద్మాశాలీలు సైతం 4 శాతానికి కొంచెం అటూ ఇటూగా ఉన్నారు. ఇతర కులస్తులు 16 శాతం వరకు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో వ్యాపించి ఉన్నారు.