అనంత్-రాధికల పెళ్లి భోజనాల మెనూ చూస్తే అవాక్కవాల్సిందే…
అంబానీల ఇంట పెళ్లి వేడుకలు అంటే ప్రపంచం మొత్తం కళ్లప్పగించి చూడాల్సిందే. మొన్నటికి మొన్న శుభలేఖతో అదరగొట్టిన అంబానీలు ఇప్పుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ భోజనానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మెనూ పూర్తిగా తెలిస్తే అవాక్కవాల్సిందే.. మార్చిలో నిర్వహించిన ప్రీవెడ్డింగ్ వేడుకలలోనే దాదాపు 2,500 రకాల వంటకాల్ని అతిథులకు రుచి చూపించారు. ఇక పెళ్లికి ఎన్నిరకాలు ఉంటాయో అంటూ ఆశ్చర్యపోతున్నారు. జూలై 12న జరగబోయే పెళ్లిలో భోజనాలకు సంబంధించిన కొంత మెనూ సమాచారం బయటకు వచ్చింది. ఈ మధ్య వారణాసి వెళ్లి వచ్చిన నీతా అంబానీ అక్కడ ప్రసిద్ది చెందిన కాశీ చాట్ బండార్ స్టాల్‌లో ఛాట్ రుచి చూసిన సంగతి వార్తల్లో ప్రముఖంగా వచ్చింది. తన కుమారుని వివాహానికి ఈ చాట్ బండార్ నుండి వంటకాలు పెట్టాలని కోరారు. దాని యజమాని కేసరి స్వయంగా ఈ వివాహంలో ముఖ్య అతిథులకు తన చాట్స్ రుచి చూపించనున్నారు. వీటిలో టిక్కీ, టమాటా చాట్, పాలక్ చాట్, చనా కచోరి, దహీ పూరి, బనారస్ చాట్, కుల్ఫీ, ఫలూదా వంటి పదార్థాలు ఉన్నాయి. వీరి వివాహం జూలై 12న ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోతోంది. జూలై 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్ జరగనున్నాయి.


