ప్రచార ముగింపు సమావేశంలో రిషి సునాక్ భావోద్వేగం
బ్రిటన్ ప్రధాని ఎన్నికల సంబంధించిన సమరం తుది ఘట్టానికి చేరుకుంది. పోటీలో ఉన్న ఇద్దరు అగ్రనేతల భారీ ప్రచార కార్యక్రమం కోలాహలంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన చివరి సభను నిర్వహించారు. లండన్‌లోని వెంబ్లీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రిషి సునాక్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .

ప్రజా సేవలో ప్రవేశించడానికి నాకు స్పూర్తినిచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడే ముందు వరుసలో వున్నారని వాళ్లే తన తల్లిదండ్రులని తండ్రి యశ్వీర్, తల్లి ఉషాల వైపు చూపించారు. ప్రజల కోసం వారు చేసిన సేవే తనను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించాయని రిషి తెలిపారు. కృషి, నమ్మకం, కుటుంబ ప్రేమతో ఎవరైనా ఏమైనా సాధించవచ్చని వారు తనకు నేర్పించారని రిషి సునాక్ ప్రశంసించారు. అలాగే తన భార్య అక్షత మూర్తి గురించి మాట్లాడిన రిషి పద్దెనిమిదేళ్ల క్రితం హైహీల్స్ ను వదిలేసి.. భుజాన తగిలించుకునే బ్యాగుతో పొట్టి కుర్రాడిని ఎంచుకున్నందుకు థ్యాంక్స్ అంటూ తన భార్య అక్షతా మూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సంపన్న కుటుంబాన్ని వదులుకొని సాధారణ జీవితంలోకి రావడం ఎంతో గొప్ప విషయమన్నారు.

చర్చలో భాగంగా టోరి సభ్యులు అడిగిన ప్రశ్నలకు రిషి సమాధానమిచ్చారు. ప్రధానిగా పోటీ చేస్తోన్న క్రమంలో మీరు ఏం త్యాగం చేయాల్సి వచ్చిందని అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రిషి..గత రెండు సంవత్సరాలుగా ఓ భర్తగా, ఓ తండ్రిగా వారికి తగిన సమయం కేటాయించలేకపోయానన్నారు. ఈ క్రమంలో తన సతీమణి అక్షతా ఎంతో తోడుగా నిలిచిందన్నారు. దేశంలోని లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చగలనని తాను భావిస్తున్నట్లు సునాక్ అన్నారు. ఇందుకు కుటుంబంతో పాటు తన మద్దతుదారుల నుంచి భారీ స్పందన రావడం నిజంగా అదృష్టమని రిషి సునాక్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇకపోతే.. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని ఎన్నికపై కన్జర్వేటివ్ పార్టీలో ఓటింగ్ ముగుస్తుంది. దాదాపు 1,60,000 మంది టోరీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. శ్రుకవారం సాయంత్రం వరకు సాగే పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు మాత్రం సోమవారం వెల్లడిస్తారు. లిజ్ ట్రస్‌వైపే సర్వేలన్నీ మొగ్గు చూపుతున్నప్పటికీ రిషి సునాక్‌ను అంత తేలిగ్గా అంచనా వేయొద్దని విశ్లేషకులు అంటున్నారు.