NationalNews

అగ్నిపథ్ స్కీమ్‌… అల్లర్లపై సుప్రీంలో పిటిషన్

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనల గురించి విచారించడానికి, రైల్వేతో సహా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టం గురించి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి నేతృత్వంలో ఎక్స్‌పర్ట్స్ కమిటీని నియమించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీ కోరారు. అగ్నిపథ్… స్కీమ్ ఆర్మీలో పనిచేసేందుకు తగినదో లేదో తేల్చాలని… ఇలాంటి పథకం ఆర్మీలో చేరిన అభ్యర్ధుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని పిటీషనర్ అభిప్రాయపడ్డారు. ఈస్ట్రన్ రైల్వే పరిధిలో 20 బోగీలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారని, ఈ అల్లర్లతో 164 రైళ్లు రద్దు చేశారని… ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారని పిటిషన్‌లో విశాల్ తివారీ పేర్కొన్నారు. ఆందోళన కారుల విధ్వంసం వల్ల దేశవ్యాప్తంగా 300 రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని, 200 ప్రధాన రైళ్లు రద్దు చేయబడ్డాయని పిటిషనర్ తెలిపారు. ఈ పిటీషన్‌లో కేంద్ర ప్రభుత్వంతోపాటు యూపీ, రాజస్థాన్, హర్యానా, బీహార్ , తెలంగాణ రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చారు.