రాజ్యసభలో అగ్నిపథ్..లోక్‌సభలో వంట గ్యాస్ ధర..ప్రధాని మోదీ మాటల్లో పార్లమెంటు సమావేశాలు
ఈ రోజు నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో అగ్నిపథ్ ,వంటగ్యాస్ ధర పెంపు వంటి అంశాలపై చర్చించాలని విపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.ఈ నేపథ్యంలో రాజ్యసభలో అగ్నిపథ్‌పై రూల్ నెం.267 కింద సీపీఐ,కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు బినోయ్ విశ్వం ,శక్తిసిన్హ్ గోహిల్ వాయిదా తీర్మానాన్ని ప్రకటించారు. అదే విధంగా లోక్‌సభలో గ్యాస్‌ధరల పెంపుపై చర్చ కోసం కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగుర్ సహా పలు విపక్షాల సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రకటించారు. ఈ సమావేశాలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ బయట వాతావరణం చల్లబడటం లేదు. మరి సభ లోపల వేడి తగ్గుతుందో లేదో చూడాలన్నారు. ఈ పార్లమెంటు సమావేశాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి అర్ధవంతంగా జరగాలని భావిస్తున్నా అన్నారు
అలాగే పార్లమెంటు సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలని తెలిపారు మోదీ. ఇది ఆజాదీ కా అమృత్ కాలం కాబట్టి రాబోయే 25 సంవత్సరాలు మనకి చాలా ప్రాముఖ్యం అన్నారు. దేశం 100 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకునే సమయానికి ,మన ప్రయాణాన్ని మనం కొత్త ఎత్తులను నిర్ణయించకోవాడానికి ఒక తీర్మానం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో కొత్త శక్తిని పెంపొందించడానికి పార్లమెంటు సభ్యులందరూ మాధ్యమంగా మారాలన్నారు. ఇది రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతన్న సమయమని… అదే విధంగా ఈ సమావేశాలు మనకు కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని అందించనున్నాయన్నారు. కాబట్టి సభ్యులందరూ ఉభయ సభల్లో లోతైన చర్చలు జరపాలని కోరుతున్నానన్నారు ప్రధాని. పార్లమెంటు చర్చలు జరపడానికి సరైన ప్రదేశమని… ఇక్కడ చర్చలు , విమర్శలు జరగడం ద్వారా విషయాలను లోతుగా విశ్లేషంచవచ్చని తెలిపారు. ఈ సమావేశాలలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. అయితే ఈ మేరకు లోక్‌సభను మధ్యహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.