చికోటితో సంబంధాలున్న నేతలపై చర్యలేవన్న దాసోజు
చికోటి ప్రవీణ్‌కు, టీఆరెఎస్ నాయకులతో ఉన్న సంబంధాలు స్పష్టం చేయాలన్నారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్. ప్రవీణ్‌కు, టీఆర్ఎస్ నేతలకు మధ్య ఉన్న లింకులకు ఆధారాలు ఉన్నాయన్నారు. తక్షణం వాటిని బయటపెట్టాలన్నారు. ఈడీ, పోలీస్ కేసులు వేగవంతం చేయాలని… కేసులో ప్రమేయం ఉన్న నేతలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని శ్రావణ్ కోరారు. ఈడీ రైడ్స్ మొదలు కాగానే డీసీసీబీ చైర్మన్ చిట్టిదేవేందర్ చికోటికి సంబంధించిన క్యాసినో మనీ ల్యాండరింగ్ పత్రాలతో కూడిన ఒక సూట్‌కేసును కొండపాక గ్రామంలో బ్రాంచ్ లాకర్లలో దాచిపెట్టారనీ తనవద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఇంకొక సూట్‌కేస్‌ను టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో కూడా దాచారని తెలియజేసారు. ఆ డాక్యుమెంట్లు బయటకి తెప్పించాలని, ఈడీ బ్యాంక్ లాకర్లను అత్యవసరంగా స్వాధీనం చేసుకోవాలనీ డిమాండ్ చేసారు. లేకపోతే చైర్మన్ తన అధికారాన్ని ఉపయోగించి, ఆ డబ్బును, కీలక పత్రాలనూ వేరే చోటకి తరలించే ప్రమాదం ఉందన్నారు. ఈ కేసులో సంబంధం ఉందని బయటపడుతున్న రాజకీయనాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి వంటి టీఆర్ఎస్ నాయకుల గురించి కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఎవరూ పెదవి విప్పడం లేదన్నారు.
కేసీఆర్ స్పందించి, నిజాయితీ నిరూపించుకోవాలనీ, CBI విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలనీ సవాల్ చేసారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు కష్టాలు పడుతుంటే చికోటి లాంటి వాళ్లు ప్రజల సొమ్ముతో క్యాసినో ఆడుతున్నారన్నారు. ఇంత పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతూ ఉంటే టీఆర్ఎస్ మంత్రుల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు బయటకి పొక్కినా కూడా చర్యలు తీసుకోవడం లేదంటే ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సోనియాగాంధీపై చేయని తప్పుకు ఈడీ విచారణ జరిపిస్తున్నారనీ మండిపడ్డారు. కాంగ్రెస్ తరపున, ప్రజల తరపున తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానన్నారు.