చంద్రబాబు హౌస్ రిమాండ్ పై నేడు కోర్టు తీర్పు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్ పై తీర్పును విజయవాడ కోర్టు నేటికి వాయిదా వేసింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై సోమవారం ఉదయం నుంచి ఇరుపక్షాలు వాడి వేడిగా సుదీర్ఘ వాదనలు వినిపించాయి. కోర్టులో విచారణ ప్రారంభం కాగానే వాదనలు కొనసాగుతున్నంత సేపు టెన్షన్ నెలకొంది. సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది వివేకానంద, మరోవైపు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన మీదట సాయంత్రం 4.30గంటలకు తీర్పు వస్తుందని భావించారు. కానీ చివరి నిమిషంలో మళ్లీ ఇరు వర్గాల నుంచి వాదనాలను వినాల్సి రావటంతో న్యాయమూర్తి నుంచి పిలుపు రావడంతో వాదనలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. దీంతో తీర్పు మరింత ఆలస్యమైంది. తీర్పు పై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో హౌస్ కస్టడీ పిటిషన్ పై కోర్టు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి హిమబిందు ప్రకటించారు.

