ఆర్టికల్ 370 రద్దు తప్పేం కాదు…సుప్రీంకోర్టు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యంగబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. అది రాజ్యాంగబద్దమైనదేనని తప్పేంకాదని, ఈ విషయంలో తమ జోక్యం అనవసరమని తీర్పునిచ్చింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఈ ఆర్టికల్ రద్దుపై అనేక మంది తమ పిటిషన్లను వేశారు. జమ్మూకాశ్మీర్‌పై భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయలేరని, జమ్మూకాశ్మీర్ భారత్‌లో విలీనం చెందిన తర్వాత దానికి ప్రత్యేక సార్వభౌమాధికారాలు ఉండవని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అప్పటి యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఈ ఆర్టికల్‌ను ప్రవేశపెట్టారని, దానిని శాశ్వతంగా భావించడం తప్పని పేర్కొంది. దానిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని, హక్కుల విషయంలో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేకత ఏమీ లేదని, అది కూడా ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలాగే సమానమని పేర్కొంది. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ తన తీర్పును వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్రహోదాను కల్పించాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. 2024 సెప్టెంబరు 30 లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కేంద్రఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. ఆగస్టు 2 నుండి సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం నేడు ఈ తీర్పును వెల్లడించారు.


 
							 
							