ఔరా అన్పిస్తున్న ఆరా… కొనియాడిన మర్రి
మాటలు కాదు.. చేతల్లో చూపడమంటే ఆయనకు మహా ఇష్టం… అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఏదైనా చేసే ముందు ఎంతో ఆలోచించి గానీ నిర్ణయం తీసుకోరు. తాత గారి నుంచి వచ్చిన వారసత్వాన్ని పునికిపుచ్చుకొని… ఔరా అన్పించుకుంటున్నారు షేక్ మస్తాన్ వలీ ఉరాఫ్ ఆరా మస్తాన్. సొంత ఊరిపై ఎవరికైనా మమకారం ఎక్కువగా ఉంటుంది. చిలకలూరి పేట నియోజకవర్గంలోని మద్దిరాల గ్రామం ఆరా మస్తాన్ సొంత ఊరు. గ్రామంలో నిరుపేద విద్యార్థులు చదువుకోడానికి తను స్థాపించిన ఆరా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు మస్తాన్. స్కూలు నిర్మాణం దగ్గర్నుంచి… విద్యార్థులకు సౌకర్యాల కల్పన వరకు ఎన్నో కార్యక్రమాలకు నేనున్నానంటూ నిర్వహించి అండగా నిలుస్తున్నారు.
తాజాగా ప్రభుత్వ స్కూలులో చదువుకున్న విద్యార్థులు రాష్ట్రంలోనే మేటిగా నిలిచారు. మద్దిరాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న షేక్ రబ్బానీ 571 మార్కులతో సత్తా చాటితే… షేక్ రజియా బేగం 555 మార్కులతో నేను సైతం అంటూ ప్రతిభ చూపించింది. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులకు 10,116/- (పదివేల నూట పదహారు రూపాయలు) ఇచ్చి వారిని ప్రోత్సహించారు ఆరా మస్తాన్… చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ చేతులు మీదుగా ఇద్దరు విద్యార్థులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆరా ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారాయన. పేద విద్యార్థుల కోసం ఆరా ఫౌండేషన్ ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని కొనియాడారు. గ్రామంలో ఉన్న ప్రతి పేదోడు చదువుకోవాలని సొంత ఊరిలో స్కూలును ఆరా మస్తాన్ తీర్చిదిద్దారని చెప్పారు మర్రి రాజశేఖర్. వచ్చే సంవత్సరం మద్దిరాల స్కూలులో చదువుకునే విద్యార్థులు షేక్ రబ్బానీ సాధించిన 571 మార్కుల కంటే ఒక్క మార్కు ఎక్కువ తెచ్చుకున్నా వారు ఇంటర్ చదివేందుకు అయ్యే మొత్తం ఖర్చు తనే భరిస్తానని హామీ ఇచ్చారని… విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మర్రి రాజశేఖర్.

