NationalNews

ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధించాల్సిందే…!

Share with

◆ ఇప్పటికే ప్రారంభమైన ప్రక్రియ
◆ నిత్యజీవితంలో ప్రతి అవసరానికి ఆధారమైపోయిన ఆధార్ కార్డు
◆ ఇంట్లో నుంచే లింక్ చేసుకునే సదుపాయం

ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డు ఆధారమైపోతోంది. ఆధార్ కార్డుతో అనుసంధానం ఒక్కొక్కటిగా అమలవుతోంది. ఇప్పుడు మరో కీలకమైన కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించబోతోంది ప్రభుత్వం. నిత్యజీవితంలో ప్రతి అవసరానికి ఆధార్ కార్డు ఆధారమైపోతోంది. రేషన్ కార్డుతో, పాన్ కార్డుతో ఇలా ప్రతి ఒక్కటితో ఆధార్‌కు లింక్ ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఓటరు ఐడీ కార్డును ఆధార్ కార్డుతో లింకే చేసే ప్రక్రియను ప్రారంభించింది.

నకిలీ ఓట్లను అరికట్టడం, బోగస్‌ ఓటర్‌ ఐడీలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియను ఆగస్టు 1 నుంచే దేశ వ్యాప్తంగా ప్రారంభం అయింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల దిద్దుబాటు, అడ్రెస్ మార్పు తదితర అవసరాలకు సంబంధించిన కొత్త దరఖాస్తుల విధానం అమల్లోకి వచ్చింది. కాగా ఈ ప్రక్రియ కోసం ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి కాదని ఐచ్ఛికంగా గుర్తించారు. ఆధార్‌ కార్డు లేకున్నా మరో పది గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలతో ఓటరుగా పేరును నమోదు చేసుకోవచ్చు. వీటిలో గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్‌/బ్యాంక్‌ పాస్‌బుక్‌ , ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంట్‌ విత్‌ ఫొటోగ్రాఫ్‌, సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు విత్‌ ఫొటోగ్రాఫ్‌, అఫీషియల్‌ ఐడెంటిటీ కార్డు, యూనిక్‌ ఐడెంటిటీ ఐడీ కార్డులతో ఓటరుగా పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

కాగా ఎన్నికల సంఘం పోర్టల్‌, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా, ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడీలను ఇంట్లో నుంచి అనుసంధానం చేయవచ్చు. ఈ లింకింగ్‌ను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎన్నికల సంఘం పోర్టర్ ద్వారా కూడా చేయొచ్చు. ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌కు వెళ్లాలి. పోర్టల్‌లో మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్‌ చేయాలి. పేరు, పుట్టిన తేదీ మొదలైన ఇతర వివరాలను నమోదు చేయాలి. ఆ తరువాత మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటిపి వస్తుంది. ఆధార్ ధ్రువీకరణ కోసం ఈ ఓటిపీని నమోదు చేయాలి. ఆధార్ ఓటర్ ఐడీ లింకింగ్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఇవ్వనున్నారు. ఏడాదిలో నాలుగు సార్లు.. కాగా కొత్త నిబంధనల ప్రకారం ఏడాదిలో నాలుగు సార్లు 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి ఓటరుగా జాబితాలో పేరును నమోదు చేస్తారు. గతంలో జనవరి 1 తర్వాతనే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధనలతో జనవరితో పాటు ఏప్రిల్‌, జూలై, అక్టోబర్‌ 1వ తేదీ లోపు 18 ఏళ్లు నిండితే ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవచ్చు.