అవయవదానం చేసి, ప్రాణాలు కోల్పోయిన మహిళ
ఉడుపికి చెందిన అర్చనా కామత్ గొప్పమనసు గల మహిళ. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే స్వభావం కల ఆమె తన బంధువు ఒకరికి కాలేయం పాడైపోతే తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేశారు. కానీ విధి వైపరీత్యం వల్ల ఆమె ఆరోగ్యం విషమించి ప్రాణాలు విడిచారు. అర్చన మంగుళూరులో లెక్చరర్‌గా పని చేసేవారు.
ఆమె బంధువు ఒక వృద్ధురాలికి కాలేయం పాడైపోతే అర్చన తన కాలేయంలో కొంతభాగాన్ని దానం చేశారు. 12 రోజుల క్రితం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆమె కాలేయంలో 60 శాతాన్ని వృద్ధురాలికి అమర్చారు. అర్చనను మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయగా, రెండ్రోజుల క్రితం ఆమెకు అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించింది. వెంటనే బెంగళూరులో ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. అమెకు భర్త, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఆమె కాలేయాన్ని పొందిన వృద్దురాలు ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. అవయవదానం పొందిన వృద్ధురాలు అర్చన భర్తకు పిన్ని అని సమాచారం. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 60 శాతం కాలేయాన్ని దానం చేయడం చాలా ప్రమాదకరమని, కావాలనే ఆమెను కుటుంబం ఈ ప్రమాదంలోకి నెట్టిందని మండిపడుతున్నారు.

